కదం తొక్కిన ఉపాధ్యాయులు
కదం తొక్కిన ఉపాధ్యాయులు
Published Tue, Apr 11 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM
సమస్యలపై పోరుబాట
పదోతరగతి మూల్యాంకనం బహిష్కరణ
పలువురి అరెస్టు, విడుదల
భానుగుడి (కాకినాడ) : దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు సంఘటితంగా పోరుబాటపట్టాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒకే గొంతుతో నినదించిన ప్రతినిధులు తమ సమస్యల పరిష్కారం కోసం మళ్లీ గళమెత్తారు. ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాప్టో, జాక్టోల ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు కాకినాడ పీఆర్‌జీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదోతరగతి మూల్యాంకన కేంద్రాన్ని మంగళవారం ముట్టడించి, విధులను అడ్డుకున్నారు. గంట పాటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ సీపీఎస్ విధానం, బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ విధానం, ఫెర్‌ఫార్మెన్స్ పాయింట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 8, 9 తరగతుల బాహ్య మూల్యాంకన రద్దు చేయాలని, ప్రధానోపాధ్యాయులకు డీవైఈఓలుగా పదోన్నతులు కల్పించాలని, 100 నెలల పీఆర్‌సీ అరియర్స్, బకాయి పడిన డీఏలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు.
విధులకు ఆటంకం కల్పిస్తున్నరన్న కారణంతో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు స్టేషన్లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను జేఏసీ అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం పరామర్శించారు. అరెస్టు చేసిన నాయకులను పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వారు పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో ఎస్‌టీయూ అ«ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీ శేఖర్, డీ వెంకట్రావు, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే రాఘ«వులు, కామేశ్వరరావు, పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎన్‌వీవీ ప్రసాద్, చింతాడ ప్రదీప్‌కుమార్, ఏపీటీఎఫ్ నాయకులు వెంకట్రాజు, సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ సత్యనారాయణ, చెవ్వూరి రవి, పీఈటీల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంక జార్జి తదితరులు పాల్గొన్నారు.
Advertisement