అసంబద్ధం.. అన్యాయం..
అసంబద్ధం.. అన్యాయం..
Published Wed, Jun 21 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM
-బదిలీల ప్రక్రియపై భగ్గుమన్న ఉపాధ్యాయులు
-డీఈఓ కార్యాలయం ముట్టడి, ర్యాలీ
-వెబ్ కౌన్సెలింగ్, 31, 32 జీఓల రద్దుకు డిమాండ్
కాకినాడ సిటీ : అసంబద్ధమైన నిబంధనలతో కూడిన బదిలీల ప్రక్రియపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో)ల ఆధ్వర్యంలో బుధవారం జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యాలయం ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతిభ ఆధారిత పాయింట్లను తొలగించాలని, అసంబద్ధ రేషనలైజేషన్‌ను రద్దు చేయాలని, రేషనలైజేషన్‌లో భాగంగా పాఠశాలల మూసివేతను విరమించుకోవాలని తదితర డిమాండ్లను ముద్రించిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర జేఏసీ సెక్రటరీ జనరల్ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అసంబద్ధమైన నిబంధనలతో ఉపాధ్యాయ బదిలీలు చేపడితే కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. లోపభూయిష్టంగా ఉన్న జీవోల వల్ల ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బదిలీలను హడావుడిగా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని రద్దుచేసి ఇతర శాఖల్లో చేసిన విధంగా మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేయాలని, 31, 32 జీఓలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఈవో అబ్రహంకు వినతిపత్రం అందజేశారు. అనంతరం అక్కడి నుంచి బాలాజీచెరువు సెంటర్, జీజీహెచ్, జిల్లాపరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పీఎన్‌వీవీ సత్యనారాయణ, ప్రదీప్‌కుమార్ (పీఆర్‌టీయూ), పి.సుబ్బరాజు, కేవీ శేఖర్ (ఎస్‌టీయూ), కేఎస్‌ఎస్ ప్రసాద్, ప్రభాకరవర్మ, డీవీ రాఘవులు, టి.కామేశ్వరరావు (యూటీఎఫ్), లంకా జార్జ్ (పీఈటీ అసోసియేషన్), వెంకటరాజు, సుబ్రహ్మణ్యం (ఏపీటీఎఫ్) తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు.
Advertisement
Advertisement