
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి సిలబస్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పాఠశాల అధ్యాపకులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రక్రియను మరింత ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. టెన్త్ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. వాస్తవానికి ఈ పరీక్షలు గతంలో మార్చి, ఏప్రిల్‌లో జరిగేవి. కోవిడ్ కారణంగా పరీక్షలు ఆలస్యమయ్యాయి. మరో వైపు స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభం కావడం, మధ్యలో సెలవుల వల్ల సిలబస్ పూర్తికాలేదు.
ఈ నేపథ్యంలో మరో నెల పాటు స్కూళ్లకు సిలబస్ పూర్తి చేసే అవకాశం లభించింది. వాస్తవానికి ఈ ఏడాది కూడా టెన్త్ సిలబస్ 70 శాతమే అమలు చేస్తున్నారు. అందులో ఇప్పటికీ 60 శాతం మించి సిలబస్ పూర్తి కాలేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. మిగిలిన సిలబస్‌ను క్షుణ్ణంగా చెప్పాలంటే కనీసం రెండు నెలల వ్యవధి పడుతుందని, అంత సమయం లేకపోవడంతో వేగంగా ముగించేందుకు ఉపాధ్యాయులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది.
ఫలితంగా విద్యార్థులకు అర్థమైనా, కాకపోయినా సిలబస్ పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. బోధన సమయంలో పాఠం చెప్పిన తర్వాత విద్యార్థులతో నిశిత అధ్యయనం చేయించ డం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధికారులు అంటున్నారు. విద్యార్థులే సొంతంగా ఎక్కువ సమయం కేటాయించి లోతైన అధ్యయనం చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే ఈ విధానం పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు.
ఇంత వరకూ లోతైన బోధన జరిగిందని, ఇప్పుడు పైపైన బోధన చేస్తే, వాటిల్లోనే విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తే సమాధానం ఇవ్వడం విద్యార్థులకు కష్టంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రణాళికా బద్దంగా బోధన జరగకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నష్టపోయే వీలుందంటున్నారు. ఇది కాకుండా రివిజన్‌కు సమయం ఉండే వీల్లేదని టీచర్లు అంటున్నారు. కోవిడ్ కాలంలో జరిగిన ఆన్‌లైన్ క్లాసులపై అవగాహన కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment