పది పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు,(ఇన్‌సెట్లో) క్యాండిల్ వెలుతురులో చదువుకుంటున్న విద్యార్థులు
పత్తికొండ అర్బన్, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షల సమయం సమీపించింది. చదువుకుందామని తెల్లవారుజామున లేస్తే చీకటి స్వాగతం పలుకుతుంది. పది పరీక్షలు ఈనెల 27వతేదీ నుంచి వచ్చేనెల 11వతేదీ వరకు జరగనున్నాయి. పత్తికొండ మండల పరిధిలోని పుచ్చకాయలమాడ నుంచి 30మంది విద్యార్థులు, దేవనబండ 21, హోసూరు 78, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల 170, బాలికోన్నత పాఠశాల 140, గురుకులం బాలుర, బాలికల పాఠశాలల్లో 210మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వారు సుమారు 300 మంది వరకు పది పరీక్ష రాయనున్నారు.ఉపాధ్యాయులు ఎలాగోలా విద్యాసంవత్సరాన్ని పూర్తి చేశారు. పలు పాఠశాలల్లో ఇంకా సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మరికొన్ని చోట్ల పున శ్చరణ తరగతులు మొక్కుబడిగా ముగిశాయి. విద్యార్థులందరిలోనూ ఒకటే టెన్షన్. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఏకాగ్రతతో చదువుకోవాలంటే వారిని కరెంటు కోతలు వేధిస్తున్నాయి. దీంతో పరీక్షల ఫలితాలు ఎలా ఉంటాయోన నే భయం విద్యార్థులను తల్లిదండ్రులను పట్టుకుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రారంభానికి ముందు, ముగింపు తరువాత ఒక్కో గంట ప్రకారం అదనంగా (పునశ్చరణ) తరగతులు నిర్వహించాలని మూడు నెలల క్రితమే నిర్ణయించారు. అయితే అనేక పాఠశాలల్లో ఇవి మొక్కుబడిగానే ముగిశాయి. డిసెంబర్ 31వతేదీ లోపలే సిలబస్ పూర్తి చేసి పునశ్చరణ చేయాల్సి ఉండగా ఇప్పటికీ పలు చోట్ల సిలబస్ పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని మారుమూల ప్రాంత పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రిపరేషన్ పరీక్ష :
కరెంటు కోతల కారణంగా విద్యార్థులకు ప్రిపరేషన్ ‘పరీక్ష’గా మారింది. పగలు రాత్రి తేడా లేకుండా విధిస్తున్న నిరవధిక కోతలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధికారికంగా ఉదయం 6 గంటల నుంచి 9గంటల వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు పత్తికొండలో కోతలు విధిస్తుండగా పల్లెల్లో 12గంటల వరకు కోతలు అమలవుతున్నాయి. ఇక అనధికారిక కోతలకు లెక్కేలేదు. విద్యార్థులకు పరీక్షలు దగ్గరపడుతుండటంతో రాత్రింబవళ్లు చదువుదామనుకుంటే కరెంటు కోతలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి.