
సాక్షి, అమరావతి/ మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. కోవిడ్–19 నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయవాడలోని సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేశ్ ఏమన్నారంటే..
► ప్రతి కేంద్రంలో గదికి 10 నుంచి 12 మంది విద్యార్థులే ఉండేలా చర్యలు.
► గతంలో నిర్ణయించిన 2,882 పరీక్ష కేంద్రాలు 4,154కు పెంపు.
► ప్రతి గదిలో మాస్కులు, శానిటైజర్లు.
► విద్యార్థుల కోసం 8 లక్షల మాస్కులు సిద్ధం.. టీచింగ్ స్టాఫ్‌కు గ్లౌజులు.
► ప్రతి కేంద్రంలో థర్మల్ స్కానర్ ఉండేలా 4,500 స్కానర్ల ఏర్పాటు.
► ప్రస్తుతం ఉన్న కంటైన్మెంట్ జోన్లలో పరీక్ష కేంద్రాలు ఉండవు.
► ఇదే తరహాలో జాగ్రత్తలతో ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా నిర్వహిస్తాం.
► జూలై చివరికి నాడు–నేడు కింద తొలి దశలో పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి.
సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ చినవీరభద్రుడు, మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ సలహాదారు మురళి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
అధ్యాపకులు ప్రచారం చేయాలి
ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై అధ్యాపకులు ప్రచారం చేయాలని మంత్రి సురేశ్ కోరారు. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు మంగళవారం మంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. ‘ప్రభుత్వ విద్యను పటిష్టం చేద్దాం’ పేరుతో సంఘం ముద్రించిన కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం చేస్తున్న చర్యలకు తమ వంతుగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ అధ్యాపకులు సేకరించిన రూ.కోటి 15 లక్షల చెక్కును సంఘం నాయకులు మంత్రికి అందించారు.
Comments
Please login to add a commentAdd a comment