సాక్షి, అమరావతి: జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు ఇస్తున్న చిక్కీలు, గుడ్ల టెండర్లపై తెలుగుదేశం నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందనే కడుపు మంటతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంభోదిస్తున్న టీడీపీ నేత పట్టాభి అచ్చోసిన ఆంబోతులా మాట్లాడాడని, ఇటువంటి వారిని చూస్తూ ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. సచివాలయంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
ఆ రెండూ అర్హతకు నోచుకోలేదు
టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనాన్ని 80 శాతం మంది కూడా తినేవారు కాదు. కానీ, ప్రత్యేక మెనూతో అందిస్తున్న జగనన్న గోరుముద్దను 90 శాతానికి పైగా పిల్లలు స్వీకరిస్తున్నారు. టీడీపీ నేతలు కేంద్రీయ భండార్, ఎన్‌సీసీఎఫ్ సంస్థలకు టెండర్లు రాలేదన్న దుగ్ఢతో మాట్లాడుతున్నారు. ట్రేడర్లు కాకుండా నేరుగా తయారీదారులే చిక్కీలు ఇచ్చేందుకు వీలుగా టెండర్ల నిబంధనలు పెట్టాం. వేల టన్నులు మేర సరఫరా చేసి ఉండాలని, సొంతంగా మెకనైజ్డ్ సామర్థ్యం కలిగి ఉండాలని నిబంధన పెట్టాం. ఈ కంపెనీల సామర్థ్యాలను పరిశీలించాలని టాటా ప్రాజెక్టు లిమిటెడ్ అనే థర్డ్ పార్టీని కోరాం. కేంద్రీయ భండార్ సంస్థకు సరైన ఎక్విప్‌మెంటు లేదని పరిశీలనలో తేలింది. అలాగే, ఎన్‌సీసీఎఫ్ అనేది ఒరిజినల్ మాన్యుఫ్యాక్చరర్ కాదు.
తమకు చిక్కీలు సరఫరా కోసం వారు తయారీదారుల నుంచి టెండర్లను పిలిచి ఎంత కమీషన్ ఇస్తారో చెప్పండని ప్రకటనలు ఇచ్చారు. అది కూడా థర్డ్ పార్టీ పరిశీలనలో అర్హతకు నోచుకోలేదు. ఆరు సంస్థలనే పిలిచి టెండర్లు ఇచ్చినట్లు ఆరోపించడం సరికాదు. ఆరు ప్యాకేజీలకు గాను మొత్తం 62 బిడ్లు వచ్చాయి. గత ఏడాదికి ఈ ఏడాదికి మాదిరిగానే టర్నోవర్, ఐటీ, జీఎస్టీ, సరఫరా సామర్థ్యం వంటి నిబంధనలు యధాతథంగా పెట్టాం. ఈ పథకం వ్యయం 2020లో రూ.1,546 కోట్లు, 2021లో రూ.1,800 కోట్లు, 2022లో రూ.1,900 కోట్లకు పెరిగింది.
ఇలా చిక్కీల కోసం మూడేళ్లలో రూ.350 కోట్లు అదనపు ఖర్చు అయ్యింది. రూ.62 కోట్లు మేర టెండర్లు పెంచేశారన్నది అవాస్తం. గతంలో 36 లక్షల మందికి ఈ పథకం అమలుకాగా.. ఇప్పుడు అదనంగా ఏడు లక్షల మంది పెరగడం, కోవిడ్ కారణంగా పిల్లలకు ప్రత్యేక ప్యాకింగ్‌తో అందిస్తున్నందున ఖర్చు మరింత పెరిగింది. ఇక మారుతీ ఆగ్రోస్ లిమిటెడ్‌కు జీఎస్టీ విషయంలో మినహాయింపునివ్వలేదు. బాలాజీ గ్రౌండ్‌నట్ సంస్థకు మూడేళ్ల సరఫరా అనుభవంతోపాటు రూ.50 కోట్ల మేర చిక్కీల సరఫరా సామర్థ్యం ఉంది.
గుడ్ల టెండర్లను ఖరారు చేయలేదు
ఇక గుడ్డులో గోల్‌మాల్ అని ఆరోపిస్తున్నారు. అసలు ఇప్పటివరకు ఆ టెండర్లను ఖరారు చేయలేదు. టీడీపీ హయాంలో గుడ్ల సరఫరా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కటే టెండర్ పిలిచి మొత్తం గోల్‌మాల్ చేశారు. మా ప్రభుత్వం డివిజన్ స్థాయిలో టెండర్లు పిలిచి పారదర్శకంగా సంస్థలను ఎంపికచేస్తోంది. టీడీపీ హయాంలో గుడ్డు 45 గ్రాములకు మించి ఉండాలంటే ఇప్పుడు 50 గ్రాములకన్నా తక్కువ ఉండరాదని నిబంధన పెట్టాం. గతంలో గుడ్ల రవాణా చార్జీల కింద 84 పైసలు వసూలుచేయగా ఇప్పుడు దానికన్నా 21 పైసలు తగ్గింది. టీడీపీ హయాంలో ట్రేడర్లను ఎంపిక చేయగా మేం కేవలం పౌల్ట్రీఫారం దారులను మాత్రమే ఎంపిక చేస్తూ పౌల్ట్రీ రైతులకు మేలు చేస్తున్నాం. టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం బాగాలేక పిల్లలు రోడ్డెక్కిన ఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి నేతలా మాపై విమర్శలు చేసేది.. అని మంత్రి సురేష్ మండిపడ్డారు.
చిక్కీ, గుడ్ల సరఫరాపై టీడీపీ అవాకులు చెవాకులు
Published Wed, Feb 2 2022 4:23 AM | Last Updated on Wed, Feb 2 2022 8:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment