ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
సాక్షి, అమరావతి: విద్యార్థుల భవిష్యత్‌తో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, తన స్వార్థ ప్రయోజనాల కోసం వారిని బలిపీఠం ఎక్కిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ఎయిడెడ్ ముసుగులో రాష్ట్రంలో అరాచకం, అలజడి సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలను వక్రీకరిస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీ వద్ద సోమవారం జరిగిన ఘటన, దాని వెనుక కుట్రను మంత్రి విజయవాడలో మంగళవారం మీడియాకు వివరించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టమైన ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. యాజమాన్యాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన పాఠశాలలు మాత్రమే ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని, ఎవరిపైనా ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. యాజమాన్యాలు స్వయంగా నిర్వహించుకుంటామంటే నిర్వహించుకోవచ్చని సీఎం విస్పష్టంగా ప్రకటించారన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..
అనంతపురం ఘటన దుండగుల దుశ్చర్య
అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీలో పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యార్థి సంఘాల ముసుగులో కొందరు దుండగులు విద్యార్థులను కాలేజీలోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకుని.. వారిపై రాళ్ల దాడి చేయించారు. ఈ వీడియోలు మా దగ్గర ఉన్నాయి. పోలీసులు ఎక్కడా ఎవరిపైనా లాఠీచార్జి చేయలేదు. గాయపడిన విద్యార్ధిని జయలక్ష్మి కూడా పోలీసులు తమపై లాఠీచార్జి గాని, దౌర్జన్యం గాని చేయలేదని, బయటినుంచి ఎవరో రాళ్లు విసిరారని చెప్పింది. కానీ చంద్రబాబు, లోకేశ్ కట్టుకథలు అల్లుతున్నారు. ఈ కాలేజీ యాజమాన్యం ఎయిడెడ్ సిబ్బందిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేసింది.
కాలేజీ విషయంలో మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన వారికి, కొంతమంది కమిటీ సభ్యులకు మధ్య అంతర్గతంగా వైరం నడుస్తోంది. వారి విభేదాలను సాకుగా చేసుకుని విద్యార్థి సంఘాల ముసుగులో చంద్రబాబు అక్కడ ఘర్షణలు రేపారు. రాళ్లు విసిరి విద్యార్థిని గాయపరిచిన ఘటనలో దోషులను గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. తల్లిదండ్రులు, యాజమాన్యాలు, విద్యార్థులకు ఎలాంటి అనుమానాలున్నా తీర్చడానికి, సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఆ జీవో ఇచ్చిన ఘనుడు చంద్రబాబే
1999లో ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం లేదని ఉత్తర్వులిచ్చిన ఘనత చంద్రబాబుది. ప్రభుత్వ, ఎయిడెడ్ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందీ ఆయనే. ప్రైవేటు యూనివర్సిటీలను, కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రత్యేక చట్టం చేయడమే కాకుండా వారికి వందలాది ఎకరాలను ధారాదత్తం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చేరికలు తగ్గిపోతూ ప్రమాణాలు దిగజారిపోతుండడంతో కమిటీని నియమించి ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఎయిడ్ లేనందువల్ల ఫీజులు పెరుగుతాయన్నది అవాస్తవమే. ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన మేరకే ఫీజులుంటాయి. ఆ మొత్తాలను ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన కింద పూర్తిగా రీయింబర్స్ చేస్తోంది. విద్యార్థులపై నయాపైసా భారం పడదు.
Comments
Please login to add a commentAdd a comment