
పవన్ కళ్యాణ్.. చంద్రబాబు దత్తపుత్రుడని సీఎం జగన్ ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారని, టీడీపీ ముసుగు కప్పుకొన్న పవన్... ముసుగు తొలగించాడన్నారు.
సాక్షి, ప్రకాశం జిల్లా: టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఈ రోజు పొడిచింది కాదని, మేము ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్.. చంద్రబాబు దత్తపుత్రుడని సీఎం జగన్ ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారని, టీడీపీ ముసుగు కప్పుకొన్న పవన్... ముసుగు తొలగించాడన్నారు. కానీ ఆ ముసుగు వెనుక ఉన్న పవన్ కల్యాణ్ అసలు స్వరూపం ఏమిటనేది మేము ముందు నుంచే చెబుతున్నాం’’ అని మంత్రి అన్నారు.
‘‘టీడీపీ, జనసేన ఇంకా ఏ పార్టీలతో కలిసి వచ్చినా సీఎం జగన్ నాయకత్వంలో మేము సింగల్ గానే పోటీ చేస్తాం. ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి కాకుండా ఏ శక్తి కూడా ఆపలేదు. పవన్ కళ్యాణ్‌కు ఒక జెండా, అజెండా ఏమి లేదు... ఇప్పుడు అతని అజెండా టీడీపీని గట్టేక్కించటమే’’ అని మంత్రి దుయ్యబట్టారు.
‘‘అవినీతి పరుడని చంద్రబాబును కోర్టు జైలుకు పంపితే అటువంటి వ్యక్తికి నేను మద్దతు పలుకుతున్నానని పవన్ చెప్పటం హాస్యాస్పదం. మునిగిపోతున్న టీడీపీ పడవను నేను గట్టెక్కిస్తానని టీడీపీతో పాటు తాను మునిగిపోతూ.. తనను నమ్ముకున్న జనసైనికులను కూడా నిలువునా ముంచుతున్నాడు. పవన్ అసలు స్వరూపం ప్రజలకు ఎప్పటినుంచో తెలుసు. కాకపోతే నిన్ను నమ్ముకుని భ్రమలో ఉన్న నీ జన సైనికులకే నీ అజెండా ఏమిటో చెప్పుకో. అసలు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో.. కనీసం ఎమ్మెల్యేగా ముందు నువ్వు గెలుస్తావో లేదో చెప్పగలవా? పవన్’’ అంటూ మంత్రి ఆదిమూలపు మండిపడ్డారు.
చదవండి: ఇదంతా చంద్రబాబుకి తెలిస్తే ఫీల్ అవ్వరా?