సాక్షి, అమరావతి/ఒంగోలు: నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణల మీద మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా విచారణ కోరి తన నిజాయితీని నిరూపించుకున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదో ఒక విషయం వెలుగులోకి రాగానే దానిని అధికార పార్టీకి అంటగట్టి రాజకీయాలు చేయాలని చూడటం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. అందులో భాగంగానే నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్ల వివాదంలోకి బాలినేనిని లాగాలని టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నించి అభాసుపాలయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న బాలినేని ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ స్వయంగా పోలీసు, రెవెన్యూ అధికారులను కోరారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ మలికాగర్గ్, కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ విచారణ చేసి వాస్తవాలను మీడియాకు వివరించి, ఇందులో బాలినేని, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర లేదని చెప్పారని వివరించారు. దీంతో బాలినేని నిజాయితి నిరూపితమైందని, తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ అభాసుపాలైందని పేర్కొన్నారు.
కంచికచర్ల ఘటనపైనా దుష్ప్రచారం
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దళిత యువకుడిపై దాడి ఘటనలో నిందితుల తరఫున తాను జోక్యం చేసుకున్నట్లు టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. యువకుడిపై దాడి చాలా బాధాకరమని, తక్షణమే పోలీసులు స్పందించి దాడి చేసినవారిపై కేసు నమోదు చేయడంతోపాటు వారిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. కంచికచర్ల పోలీసులతో తాను మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment