ఏపీలో ‘పది’ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిరంతర, సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల విభాగం డెరైక్టర్ ఎంఆర్ ప్రసన్నకుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
మార్గదర్శకాలు ఇవీ..
► 2017 మార్చిలో జరిగే పది పబ్లిక్ పరీక్షలు సీసీఈ ప్యాట్రన్‌ను అనుసరించి నిర్వహిస్తారు.
► పరీక్షలకు ఆరు సబ్జెక్టుల్లో 11 పేపర్లు ఉంటాయి.
► తుది పరీక్షలో సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 80 మార్కులకు, మిగిలిన పది పేపర్లలో ఒక్కోదాన్ని 40 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నపత్రం చదువుకోవడానికి అదనంగా 15 నిమిషాలు కేటాయిస్తారు.
► సెకండ్ లాంగ్వేజ్ మినహా మిగిలిన 10 పేపర్లలో అంతర్గత అంచనా మార్కుల కింద ఒక్కో పేపర్‌కు 10 మార్కులు(సబ్జెక్టుకు 20 మార్కులు) ఉంటాయి. ఒక్కో పేపర్‌లో ఆయా అభ్యర్థులు సాధించిన మార్కులను తుది పరీక్ష మార్కులకు జతచేస్తారు.
► ఫైనల్ పరీక్షలో కాంపోజిట్ ఫస్ట్‌లాంగ్వేజ్ పేపర్-1 తెలుగు, ఉర్దూ పరీక్షలు 60 మార్కులకే ఉంటాయి. ఇంటర్నల్ మార్కులు 20 ఉంటాయి.
► కాంపోజిట్ కోర్సు పేపర్-2 సంస్కృతం, హిందీ, అరబిక్, పర్షియన్ భాషలకు సంబంధించి 20 మార్కులకు పరీక్ష ఉంటుంది. అంతర్గత అంచనా మార్కులు ఉండవు.
► మెయిన్ లాంగ్వేజ్ సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషలకు సంబంధించి పేపర్-1, 2లలో ఫైనల్ పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. అంతర్గత అంచనా మార్కులు 20 ఉంటాయి.
► సెకండ్ లాంగ్వేజ్ మినహా అన్ని పేపర్లలో పాస్ మార్కులు 35 శాతం రావాలి. ప్రతి అభ్యర్థి ఫైనల్ పరీక్షలో ప్రతి పేపర్లో 28 మార్కులు తెచ్చుకోవాలి. మిగతావి అంతర్గత అంచనా విధానంలో సాధించాలి.
► సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌లో పాస్ మార్కులు 20 శాతం ఉండాలి. ఫైనల్ పరీక్షలో అభ్యర్థులు తప్పనిసరిగా 16 మార్కులు సాధించాలి. మిగతా మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంటు ద్వారా సాధించవచ్చు.
► ఇంటర్నల్ అసెస్‌మెంటు(అంతర్గత అంచనా)లో కనిష్ట పాస్‌మార్కులు లేవు.
► 2017 నుంచి మరాఠీ, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు హిందీ, తమిళ్, కన్నడ, ఒడియా, సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ సబ్జెక్టుల పరీక్షలుండవు.
► పాఠశాలలో చదవకుండా నేరుగా ఎస్సెస్సీ పరీక్షలకు హాజరవుతున్న వారికి ఇకపై ఆ అవకాశం ఉండదు. అలాంటి వారు ఓపెన్ స్కూల్ పరీక్షలకు హాజరవ్వాలి.
► మూగ, చెవిటి, అంధ అభ్యర్థులకు ఉత్తీర్ణత మార్కులు 20 శాతం. వీరు ఫైనల్ పరీక్షలో 16 మార్కులు పొందాలి. మిగతావి ఇంటర్నల్ మార్కుల ద్వారా సాధించాలి.
► 2016లో ఫెయిలైన అభ్యర్థులకు 2017లో మాత్రం పాత ప్యాట్రన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత పాత విధానాన్ని పూర్తిగా తీసివేస్తారు.