సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గృహాలను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయనుంది. ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లకు టిడ్కో ఎండీ ఆదేశాలు జారీచేశారు. సాధారణంగా మంగళ, శుక్రవారాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి, ఆ రోజుల్లో టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లయితే సర్వర్లపై భారం ఉండదని భావిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను మినహాయిస్తూ గత నెల 25న ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓలు 27, 28, 29) జారీచేసింది. ఈ ఫీజుల మొత్తం సుమారు రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్లు ఉంటుందని అంచనా, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదట నెల్లూరు, గుంటూరు, కర్నూలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని స్థానిక మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించడంతో పాటు, అవసరమైన మార్గదర్శకాలను టిడ్కో ఎండీ ఇచ్చారు.
నెలకు 20 వేల ఇళ్ల చొప్పున రిజిస్ట్రేషన్
టిడ్కో ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 2,62,216 ఇళ్లను నిర్మించ తలపెట్టారు. వీటిలో 300 చ.అడుగుల విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లను నిర్మించారు. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంలోని గృహాలను గతంలోనే లబ్ధిదారులకు ఒక్క రూపాయికే అప్పగించినప్పటికీ ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు. అయితే, ఇప్పుడు 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఇళ్లలో బ్యాంకు లింకేజీ పూర్తయిన వాటిని రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఈ దశలో దాదాపు లక్ష ఇళ్లు నిర్మాణంతో పాటు బ్యాంకుల లింకేజీ పూర్తయ్యాయని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు.
నెలకు 20 వేల ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. దీంతోపాటు బ్యాంకు లింకేజీ పూర్తయిన యూనిట్లను ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత 300 చ.అ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఎస్‌టీపీలతో పాటు అన్ని వసతులు కల్పించిన నెల్లూరు, గుంటూరు, కర్నూలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారన్నారు. మొత్తం అన్ని యూనిట్ల రిజిస్ట్రేషన్లకు అయ్యే సుమారు రూ.800 కోట్లకు పైగా ఖర్చును ప్రభుత్వమే భరించనుంది.
ఇచ్చిన మాటకు కట్టుబడ్డ సీఎం
వాస్తవానికి 2016లో చంద్రబాబు 300 చ.అ. యూనిట్‌కు రూ.2.65 లక్షల ధర నిర్ణయించినా.. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే ఒక్క రూపాయికే ఇచ్చారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు రూ.5.50 లక్షలు ఖర్చవుతుంది. మౌలిక వసతుల కల్పనకు అదనంగా మరో రూ.లక్ష, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.60 వేల వరకు అవుతుంది. లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై కింద రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తుంది. మిగతా మొత్తం అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అంటే సుమారు రూ.5 వేల కోట్లకు పైగా భారాన్ని ప్రభుత్వమే భరించి పేదలకు ఇళ్లు ఇస్తోంది, ఇది గొప్ప విషయం. ఇళ్ల రిజిస్ట్రేషన్‌ను నెల్లూరు మున్సిపాలిటీలోని వెంకటాపురం నుంచి ప్రారంభిస్తాం.
– జె. ప్రసన్నకుమార్, ఏపీ టిడ్కో చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment