Prasannakumar
-
టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గృహాలను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయనుంది. ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లకు టిడ్కో ఎండీ ఆదేశాలు జారీచేశారు. సాధారణంగా మంగళ, శుక్రవారాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి, ఆ రోజుల్లో టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లయితే సర్వర్లపై భారం ఉండదని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను మినహాయిస్తూ గత నెల 25న ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓలు 27, 28, 29) జారీచేసింది. ఈ ఫీజుల మొత్తం సుమారు రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్లు ఉంటుందని అంచనా, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదట నెల్లూరు, గుంటూరు, కర్నూలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని స్థానిక మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించడంతో పాటు, అవసరమైన మార్గదర్శకాలను టిడ్కో ఎండీ ఇచ్చారు. నెలకు 20 వేల ఇళ్ల చొప్పున రిజిస్ట్రేషన్ టిడ్కో ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 2,62,216 ఇళ్లను నిర్మించ తలపెట్టారు. వీటిలో 300 చ.అడుగుల విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లను నిర్మించారు. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంలోని గృహాలను గతంలోనే లబ్ధిదారులకు ఒక్క రూపాయికే అప్పగించినప్పటికీ ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు. అయితే, ఇప్పుడు 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఇళ్లలో బ్యాంకు లింకేజీ పూర్తయిన వాటిని రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఈ దశలో దాదాపు లక్ష ఇళ్లు నిర్మాణంతో పాటు బ్యాంకుల లింకేజీ పూర్తయ్యాయని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. నెలకు 20 వేల ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. దీంతోపాటు బ్యాంకు లింకేజీ పూర్తయిన యూనిట్లను ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత 300 చ.అ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఎస్టీపీలతో పాటు అన్ని వసతులు కల్పించిన నెల్లూరు, గుంటూరు, కర్నూలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారన్నారు. మొత్తం అన్ని యూనిట్ల రిజిస్ట్రేషన్లకు అయ్యే సుమారు రూ.800 కోట్లకు పైగా ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ సీఎం వాస్తవానికి 2016లో చంద్రబాబు 300 చ.అ. యూనిట్‌కు రూ.2.65 లక్షల ధర నిర్ణయించినా.. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే ఒక్క రూపాయికే ఇచ్చారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు రూ.5.50 లక్షలు ఖర్చవుతుంది. మౌలిక వసతుల కల్పనకు అదనంగా మరో రూ.లక్ష, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.60 వేల వరకు అవుతుంది. లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై కింద రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తుంది. మిగతా మొత్తం అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అంటే సుమారు రూ.5 వేల కోట్లకు పైగా భారాన్ని ప్రభుత్వమే భరించి పేదలకు ఇళ్లు ఇస్తోంది, ఇది గొప్ప విషయం. ఇళ్ల రిజిస్ట్రేషన్‌ను నెల్లూరు మున్సిపాలిటీలోని వెంకటాపురం నుంచి ప్రారంభిస్తాం. – జె. ప్రసన్నకుమార్, ఏపీ టిడ్కో చైర్మన్ -
వీడు మామూలోడు కాదు .. బీటెక్ మానేసి.. వందలాది మందితో..
కడప అర్బన్: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇతగాడి పేరు చెన్నుపల్లి ప్రసన్నకుమార్ (23). ప్రశాంత్‌రెడ్డి, రాజారెడ్డి, టోనీ అనే పేర్లతోనూ చలామణి అయిన ఇతడు బీటెక్ ఫస్టియర్‌లో చదువు మానేశాడు. ఆ తర్వాత జల్సాల కోసం దొంగగా మారాడు. చైన్ స్నాచింగ్‌లు చేయడం.. ఇళ్లకు కన్నంవేసి సొత్తు కొట్టేయడం అతడి స్టైల్. చోరీలు చేసి దొరికిపోయిన అతగాడికి బోర్ కొట్టిందో ఏమో.. సోషల్ మీడియాలో రోమియో అవతారమెత్తాడు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో రోమియో అవతారమెత్తి.. యువతులు, మహిళల్ని టార్గెట్ చేశాడు. ఆ తర్వాత వారిని తెలివిగా ముగ్గులోకి దించి నగ్న వీడియోకాల్స్, అసభ్య చాటింగ్ చేయడం.. ఆనక వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది యువతులు, మహిళలపై వలపు వల విసిరి మోసగించడమే కాకుండా భారీగా సొమ్ములు కొల్లగొట్టాడు. ఈ ఏడాది ఆగస్టు 1న పోలీసులకు చిక్కి కటకటాల పాలైన ప్రసన్నకుమార్‌పై కడప ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సిఫారసు మేరకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు శనివారం పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీడు మామూలోడు కాదు ప్రసన్నకుమార్‌పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 26 కేసులున్నాయి. చిన్న వయసులోనే దుర్వ్యసనాలకు బానిసైన ప్రసన్నకుమార్ 2017లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్, చాపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇతనిపై ప్రొద్దుటూరు త్రీటౌన్‌లో సస్పెక్ట్ షీట్ నమోదైంది. ఆ తరువాత ప్రసన్నకుమార్ కడప, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో షేర్‌చాట్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలను టార్గెట్ చేసి వారితో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పేవాడు. అసభ్యకర రీతిలో చాటింగ్ చేసేవాడు. వారికి తెలియకుండా వారి ఫొటోలు, వీడియోలను రికార్డు చేసి, బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి తన గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా డబ్బులు గుంజేవాడు. కొందర్ని శారీరకంగా లోబర్చుకునేవాడు. వందల సంఖ్యలో మహిళలను మోసగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పరువుకు సంబంధించిన విషయం కావడంతో బాధితులెవరూ ఫిర్యాదు చేసేందుకు రాలేదు. ఘరానా మోసగాడు ప్రసన్నకుమార్ చాపాడు, ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో చైన్‌స్నాచింగ్ కేసులో, 2019లో ప్రొద్దుటూరు వన్‌టౌన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కేసులో, 2020లో విజయవాడు కమిషనరేట్ పరిధిలోని పెనమలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వివాహితను లైంగికంగా వేధించి, డబ్బుల కోసం బెదిరించిన కేసులో, 2020 నవంబర్‌లో శంషాబాద్ పరిధిలోని చౌదరిగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో పెనమలూరు తరహాలో నేరం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. వైఎస్సార్ జిల్లాలోని కడప, ఎర్రగుంట్ల, వల్లూరు మండలాల్లోని పలు ఇళ్లలో దొంగతనాలు చేసిన కేసులో ఇతను ప్రధాన∙నిందితుడు. కడప తాలూకా, వన్‌టౌన్, ప్రొద్దుటూరు టూటౌన్ స్టేషన్ల పరిధిలో 2021లో పలు మోటార్ సైకిల్ దొంగతనాల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సోషల్ మీడియా వేదికగా మహిళల్ని మోసగిస్తున్న ప్రసన్నకుమార్‌పై రాష్ట్రంలోనే తొలిసారిగా పీడీ యాక్ట్ ప్రయోగించారు. -
థియేటర్ల మాఫియా ఉంది
‘‘సినిమా కళకి కులం, మతం, జాతి, ప్రాంతం.. ఉండవని నిరూపించారు రజనీగారు. స్వయంకృషితో వరల్డ్ సూపర్‌స్టార్‌గా ఎదిగారంటే అది రజనీగారొక్కరే. మన ఎన్టీ రామారావుగారు కూడా చరిత్ర సృష్టించారు. శ్రీకాంత్కూడా స్వయంశక్తితో ఈ స్థాయికి ఎదిగాడు’’ అని నిర్మాత టి.ప్రసన్న కుమార్ అన్నారు. రజనీకాంత్ హీరోగా, త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో వల్లభనేని అశోక్ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘సినిమా బావుంటే ఎవ్వడూ ఆపలేడు. ఈరోజు థియేటర్స్ మాఫియా ఎలా ఉందంటే మాఫియా డాన్స్ కంటే దారుణాతి దారుణంగా ఉంది. కేవలం ముగ్గురు నలుగురు చేస్తున్న సినిమాలకి మొత్తం థియేటర్స్ పెట్టుకుంటున్నారు. సాంకేతిక నిపుణులను బతకనిచ్చే పరిస్థితిగానీ, కొత్తవాళ్లు వచ్చే పరిస్థితిగానీ లేకుండా చాలా నీచాతి నీచంగా చేస్తున్నారు. సంక్రాంతి అంటే ఆరేడు సినిమాలు రిలీజ్ అయినా చూడగలిగే ప్రేక్షకులున్నారు. కానీ, చూడ్డానికి ఒకటి లేదా రెండు సినిమాలు తప్పితే మిగతా సినిమాలకు అవకాశం లేకుండా చేస్తున్న మాఫియా ఉంది. ఈ మాఫియా ఎండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడుగార్లకు చెబుతాం. వాళ్ల సినిమాలే ఆడాలని చూస్తున్నారు. మిగతా వాళ్లందర్నీ తొక్కి పారేస్తున్నారు. మా సినిమాలే ఉండాలి అనే ధోరణిలో వెళుతున్నారు. ఇది మంచిది కాదు. దయచేసి ఇది మీకు విజ్ఞప్తి అనుకోండి.. కాదంటే వార్నింగ్ అనుకోండి.. అయిపోతారు... చాలా మందిని చూశాం. విర్రవీగినోళ్లంతా ఆకాశంలోకి వెళ్లిపోయారు.. మీరు కూడా పోతారు. కొంచెం తెలుసుకుని కరెక్టుగా ఉండండి’’ అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య.. ‘పేట’ కూడా పెద్ద సినిమానే. వాటి మధ్య ఈ సినిమా విడుదల చేస్తున్నాడు అశోక్. ఆ సినిమాలతో పాటు ‘పేట’ కూడా ఆడాలని కోరుకుంటున్నా. రజనీకాంత్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాం. చిరంజీవిగారు, రజనీగారు నటీనటులకు స్ఫూర్తి’’ అన్నారు. చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ–‘‘ఎందరో మహానుభావులు.. ఇక్కడికి వచ్చిన వారందరికీ వందనాలు. పిలిచినా వస్తానని రాకుండా మమ్మల్ని ఆనందపెట్టిన ఇంకొందరు మహానుభావులకు నా రెండేసి వందనాలు. ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి మధ్య మన సినిమా ‘పేట’ కి థియేటర్స్ తక్కువైనా, బిజినెస్ జరిగినా, జరక్కపోయినా సొంతంగా రిలీజ్ చేద్దామని రిస్క్ తీసుకుని విడుదల చేస్తున్నా’’ అన్నారు. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ– ‘‘రజనీగారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ చరిత్ర. అలాంటివాళ్లు అక్కడక్కడా వస్తుంటారు. మనకి మన ఎన్టీ రామారావుగారు. ఆయన ఓ చరిత్ర. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో జపాన్‌లో ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న మొదటి వ్యక్తి రజనీ. సౌత్ ఇండియాలోనూ హీరోలు ఉన్నారని ప్రపం చానికి చాటిన మొదటి హీరో రజనీ ’’అన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ– ‘‘పేట’ చిత్రం మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్. రజనీసార్ అభిమానులకే కాదు, ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది. మంచి కథ. ఈ పండక్కి చాలా పెద్ద సినిమాల మధ్య మా సినిమా విడుదలవుతోంది. ఆ సినిమాలతో పాటు మా ‘పేట’ కూడా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి, నిర్మాత కిరణ్, సంగీత దర్శకుడు అనిరు«ద్, నటీనటులు బాబీ సింహా, మేఘా ఆకాశ్, మాళవికా మోహన్, పాటల రచయితలు భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
పాడిరైతు అభ్యున్నతికి పాటుపడుతూ..
పశుపోషణలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ప్రసన్నకుమార్ మామునూరు : హన్మకొండ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ రేపల్లె ప్రసన్నకుమార్ పాడిరైతుల నేస్తంగా రూపుదిద్దుకున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా ఇటీవల ‘రైతు నేస్తం’ అవార్డు వరించింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్కు చెందిన ప్రసన్నకుమార్ ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ప్రధానంగా దోహదపడింది ఆయన కుటుంబ నేపథ్యమేనని చెప్పొచ్చు. ప్రసన్నకుమార్ సోదరుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్(తెలంగాణ గురుకుల విద్యాలయాలు, సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టళ్ల కార్యదర్శి). సోదరి ఆర్.సబిత గైనకాలజిస్ట్‌గా వికారాబాద్‌లో సేవలు అందిస్తున్నారు. ఇళ్లు విద్యాలయంగా నిల్చి ప్రసన్నకుమార్‌కు జీవితంలో ఉన్నతస్థానాలకు ఎలా ఎదగాలనే పాఠాలు నేర్పింది. అంకితభావంతో విధులు ఎలా నిర్వర్తించాలనే అంశాన్ని తన సోదరుడు ప్రవీణ్‌కుమార్‌ను ఆదర్శంగా తీసుకొని నేర్చుకున్నారు ప్రసన్నకుమార్. నైతిక విలువలు, ఆదర్శాలనే ఆలంబనగా చేసుకొని రేపల్లె ప్రసన్నకుమార్ ముందుకుసాగుతున్నారు. దేశ, విదేశాల్లో అధ్యయనం చేస్తూ.. 1997 నుంచి 2000 సంవత్సరం వరకు పశువైద్యంపై పరిశోధన చేసి పీహెచ్డీ సాధించారు. అదే ఏడాది ఓ సంస్థలో పశుపోషణ, ఫీడ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అవకాశం లభించింది. దీంతో అక్కడ విధులు నిర్వర్తించారు. 2001 సంవత్సరంలో పశుపోషణ విభాగం( గేదెల పరిశోధనా స్థానం) పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడెంలో శాస్త్రవేత్తగా చేరారు. 2005లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనాత్మక ప్రాజెక్టులను నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అవార్డులను అందుకున్నారు. వ్యవసాయ పరి«శోధనలపై మరింత అధ్యయనం చేసేందుకు ఆరు దేశాల్లో పర్యటించారు. ఈక్రమంలో సౌదీ అరేబియా దేశంలో రెండేళ్లు పనిచేశారు. రైతుల దినచర్యపై టెక్నికల్ బుల్లెటిన్స్ రాసి, ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు. 2007లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి వచ్చింది. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆలంపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయగా, 600 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం ఎదురైంది. అనంతరం మళ్లీ తనకు ఎంతో ఇష్టమైన పశువైద్య విభాగం దృష్టిసారించారు. టెక్నికల్ ఇండియా జెన్కో బయోటెక్ ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2014 మార్చిలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగావకాశం కల్పించింది. 2014 నుంచి 2016 వరకు పశుపోషణ, యాజమాన్య విభాగానికి అధిపతిగా కోరుట్ల పశువైద్య కళాశాల కరీంనగర్లో విధులు నిర్వహించారు. 2016 ఏప్రిల్ 12న వరంగల్ మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో కోఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో రైతులకు ఆనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినందుకుగానూ ఆయనకు ఇటీవల రైతు నేస్తం అవార్డు దక్కింది. పొందిన అవార్డులు.. 2015లో న్యూఢిల్లీలోని ఇన్విటేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డు. 2016లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హాల్లో పశుపోషణపై అత్యుత్తమ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో డాక్టర్ మహేశ్వర్ మిశ్రా అవార్డు లభించింది. 2016లోనే పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు మెమోరియల్ అవార్డు, రైతునేస్తం పురస్కారం లభించాయి. -
ఏపీలో ‘పది’ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిరంతర, సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల విభాగం డెరైక్టర్ ఎంఆర్ ప్రసన్నకుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మార్గదర్శకాలు ఇవీ.. ► 2017 మార్చిలో జరిగే పది పబ్లిక్ పరీక్షలు సీసీఈ ప్యాట్రన్‌ను అనుసరించి నిర్వహిస్తారు. ► పరీక్షలకు ఆరు సబ్జెక్టుల్లో 11 పేపర్లు ఉంటాయి. ► తుది పరీక్షలో సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 80 మార్కులకు, మిగిలిన పది పేపర్లలో ఒక్కోదాన్ని 40 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నపత్రం చదువుకోవడానికి అదనంగా 15 నిమిషాలు కేటాయిస్తారు. ► సెకండ్ లాంగ్వేజ్ మినహా మిగిలిన 10 పేపర్లలో అంతర్గత అంచనా మార్కుల కింద ఒక్కో పేపర్‌కు 10 మార్కులు(సబ్జెక్టుకు 20 మార్కులు) ఉంటాయి. ఒక్కో పేపర్లో ఆయా అభ్యర్థులు సాధించిన మార్కులను తుది పరీక్ష మార్కులకు జతచేస్తారు. ► ఫైనల్ పరీక్షలో కాంపోజిట్ ఫస్ట్లాంగ్వేజ్ పేపర్-1 తెలుగు, ఉర్దూ పరీక్షలు 60 మార్కులకే ఉంటాయి. ఇంటర్నల్ మార్కులు 20 ఉంటాయి. ► కాంపోజిట్ కోర్సు పేపర్-2 సంస్కృతం, హిందీ, అరబిక్, పర్షియన్ భాషలకు సంబంధించి 20 మార్కులకు పరీక్ష ఉంటుంది. అంతర్గత అంచనా మార్కులు ఉండవు. ► మెయిన్ లాంగ్వేజ్ సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషలకు సంబంధించి పేపర్-1, 2లలో ఫైనల్ పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. అంతర్గత అంచనా మార్కులు 20 ఉంటాయి. ► సెకండ్ లాంగ్వేజ్ మినహా అన్ని పేపర్లలో పాస్ మార్కులు 35 శాతం రావాలి. ప్రతి అభ్యర్థి ఫైనల్ పరీక్షలో ప్రతి పేపర్లో 28 మార్కులు తెచ్చుకోవాలి. మిగతావి అంతర్గత అంచనా విధానంలో సాధించాలి. ► సెకండ్ లాంగ్వేజ్ పేపర్లో పాస్ మార్కులు 20 శాతం ఉండాలి. ఫైనల్ పరీక్షలో అభ్యర్థులు తప్పనిసరిగా 16 మార్కులు సాధించాలి. మిగతా మార్కులు ఇంటర్నల్ అసెస్మెంటు ద్వారా సాధించవచ్చు. ► ఇంటర్నల్ అసెస్మెంటు(అంతర్గత అంచనా)లో కనిష్ట పాస్‌మార్కులు లేవు. ► 2017 నుంచి మరాఠీ, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు హిందీ, తమిళ్, కన్నడ, ఒడియా, సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ సబ్జెక్టుల పరీక్షలుండవు. ► పాఠశాలలో చదవకుండా నేరుగా ఎస్సెస్సీ పరీక్షలకు హాజరవుతున్న వారికి ఇకపై ఆ అవకాశం ఉండదు. అలాంటి వారు ఓపెన్ స్కూల్ పరీక్షలకు హాజరవ్వాలి. ► మూగ, చెవిటి, అంధ అభ్యర్థులకు ఉత్తీర్ణత మార్కులు 20 శాతం. వీరు ఫైనల్ పరీక్షలో 16 మార్కులు పొందాలి. మిగతావి ఇంటర్నల్ మార్కుల ద్వారా సాధించాలి. ► 2016లో ఫెయిలైన అభ్యర్థులకు 2017లో మాత్రం పాత ప్యాట్రన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత పాత విధానాన్ని పూర్తిగా తీసివేస్తారు. -
కబ్జాదారులపై కఠిన చర్యలు
విశాఖపట్నం : కబ్జాదారులపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మో పింది. పాయకరావుపేట మండలం పీఎల్‌పురం రెవెన్యూ పంచాయితీ పరిధి లో రెవెన్యూ, అటవీశాఖకు చెందిన కొండలను తొలిచేస్తున్న దివీస్ ల్యాబరేటరీ యాజమాన్యం తీరుపై సాక్షిలో వెలువడిన కథనంపై జిల్లా యం త్రాంగం స్పందించింది. వెంటనే విచారణ చేపట్టి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం ఆర్డీఓ కె.సూర్యారావును జేసీ నివాస్ ఆదేశించారు. 260 ఎకరాలకు యాజమాన్య పత్రాలను చూపించాల్సిందిగా దివీస్ యాజమాన్యాన్ని రెవెన్యూ అధికారుల బృందం నిలదీసింది. డాక్యుమెంట్లపై దివీస్ సిబ్బంది తడబడ్డారు. దీంతో వ్యవహారం అనధికారికంగా జరుగుతున్నట్లుగా రెవెన్యూ అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చారు. రెవెన్యూ ,పారెస్ట్ శాఖలకు చెందిన కొండలపై చెట్లను ధ్వంసం చేసినవారిపై కేసు నమోదు చేయాలని నమోదు చేయాలని ఆర్డీఓ శనివారం ఆదేశించారు. తహశీల్దార్ ప్రసన్నకుమార్ కబ్జా వ్యవహారంపై పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ ఉన్నతాధికారులు కూడా వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. చదును పనులను వెంటనే నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తహశీల్దార్ ప్రసన్నకుమార్ విలేకరులకు తెలిపారు. -
ఉత్తీర్ణత బాధ్యత ఉపాధ్యాయులదే
టెన్త్ పరీక్షల్లో విద్యార్థులు తప్పితే చర్యలు ఆర్జేడీ ప్రసన్నకుమార్ కె.కోటపాడు, న్యూస్‌లైన్ : టెన్త్ పరీక్షల్లో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణులు కావాలని, లేకుంటే ఉపాధ్యాయులనే కారకులుగా గుర్తించాల్సి వస్తుందని పాఠశాల విద్య ఆర్జేడీ(కాకినాడ) ఎం.ప్రసన్నకుమార్ అన్నారు. మండలంలోని ఎ.కోడూరు జెడ్పీ ఉన్నతపాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది త్రైమాసిక, అర్ధసంవత్సర పరీక్షల్లో టెన్త్ విద్యార్థులు ఏఏ విభాగాల్లో తక్కువ మార్కులు వచ్చిందీ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలస్థాయిలోనే విద్యార్థులు పాస్‌మార్కులు సాధించలేకపోతే పబ్లిక్ పరీక్షల్లో ఎలా పాసవుతారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఉపాధ్యాయులు ఈ దిశగా పనిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం టెన్త్ విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు. పరీక్షల బెంగను విద్యార్థులు విడనాడాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో చదివి పరీక్షలను ఎదుర్కొంటే విజయం సాధ్యమన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించారు. బియ్యం స్టాక్ రూమ్‌ను పరిశీలించి నిర్వాహకుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని 815 పాఠశాలల్లో వంట షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, ఒక్కోదానికి రూ.1.05 లక్షలు కేటాయించామని తెలిపారు. రాజీవ్ విద్యామిషన్ నిధులతో జిల్లాలో 150 అదనపు తరగతులతో కూడిన భవనాల నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు. ఎ.కోడూరు హైస్కూల్లో ఆరు అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరుచేస్తామని తెలిపారు. కె.కోటపాడు జెడ్పీ హైస్కూల్లో ఈనెల 25, 26 తేదీల్లో ఐటీఐ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఈ రెండ్రోజుల తరగతులను ప్రభుత్వ సెలవుదినాల్లో నిర్వహించాలని ఎంఈవో కె.వి.రమణకు సూచించారు. -
వైఎస్సార్సీపీలో 70 కుటుంబాల చేరిక
కె. ములగ (పార్వతీపురం రూరల్), న్యూస్‌లైన్ : ములగ పంచాయతీలోని కె. ములగ, ఎన్. ములగ గ్రామాలకు చెందిన 70 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. కె. ములగ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు మడక రామ్మూర్తినాయుడు ఆధ్వర్యంలో వీరందరూ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జమ్మాన మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్సీపీయేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మాత్రమే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేశారని చెప్పారు. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తిప్పికొడతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చుక్క లక్ష్ముంనాయుడు, నాయకులు తీళ్ల పోలినాయుడు, అప్పలస్వామి, అక్కేన సత్యనారాయణ, పి. గోవిందరావు, నర్సింహనాయుడు, కె. రాంబాబు, జయంతి, తదితరులు పాల్గొన్నారు.