ఉత్తీర్ణత బాధ్యత ఉపాధ్యాయులదే
- టెన్త్ పరీక్షల్లో విద్యార్థులు తప్పితే చర్యలు
- ఆర్జేడీ ప్రసన్నకుమార్
కె.కోటపాడు, న్యూస్‌లైన్ : టెన్త్ పరీక్షల్లో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణులు కావాలని, లేకుంటే ఉపాధ్యాయులనే కారకులుగా గుర్తించాల్సి వస్తుందని పాఠశాల విద్య ఆర్జేడీ(కాకినాడ) ఎం.ప్రసన్నకుమార్ అన్నారు. మండలంలోని ఎ.కోడూరు జెడ్పీ ఉన్నతపాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది త్రైమాసిక, అర్ధసంవత్సర పరీక్షల్లో టెన్త్ విద్యార్థులు ఏఏ విభాగాల్లో తక్కువ మార్కులు వచ్చిందీ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలస్థాయిలోనే విద్యార్థులు పాస్‌మార్కులు సాధించలేకపోతే పబ్లిక్ పరీక్షల్లో ఎలా పాసవుతారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఉపాధ్యాయులు ఈ దిశగా పనిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం టెన్త్ విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు. పరీక్షల బెంగను విద్యార్థులు విడనాడాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో చదివి పరీక్షలను ఎదుర్కొంటే విజయం సాధ్యమన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించారు. బియ్యం స్టాక్ రూమ్‌ను పరిశీలించి నిర్వాహకుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలోని 815 పాఠశాలల్లో వంట షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, ఒక్కోదానికి రూ.1.05 లక్షలు కేటాయించామని తెలిపారు. రాజీవ్ విద్యామిషన్ నిధులతో జిల్లాలో 150 అదనపు తరగతులతో కూడిన భవనాల నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు. ఎ.కోడూరు హైస్కూల్‌లో ఆరు అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరుచేస్తామని తెలిపారు. కె.కోటపాడు జెడ్పీ హైస్కూల్‌లో ఈనెల 25, 26 తేదీల్లో ఐటీఐ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఈ రెండ్రోజుల తరగతులను ప్రభుత్వ సెలవుదినాల్లో నిర్వహించాలని ఎంఈవో కె.వి.రమణకు సూచించారు.