టి.ప్రసన్న కుమార్, మేఘా ఆకాశ్, మాళవిక, బాబీ సింహా, కార్తీక్ సుబ్బరాజ్, అనిరు«ద్, భాస్కరభట్ల, శ్రీకాంత్, అశోక్
‘‘సినిమా కళకి కులం, మతం, జాతి, ప్రాంతం.. ఉండవని నిరూపించారు రజనీగారు. స్వయంకృషితో వరల్డ్ సూపర్‌స్టార్‌గా ఎదిగారంటే అది రజనీగారొక్కరే. మన ఎన్టీ రామారావుగారు కూడా చరిత్ర సృష్టించారు. శ్రీకాంత్‌కూడా స్వయంశక్తితో ఈ స్థాయికి ఎదిగాడు’’ అని నిర్మాత టి.ప్రసన్న కుమార్ అన్నారు. రజనీకాంత్ హీరోగా, త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పేట్టా’. ఈ చిత్రాన్ని ‘పేట’ పేరుతో వల్లభనేని అశోక్ ఈ నెల 10న తెలుగులో విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘సినిమా బావుంటే ఎవ్వడూ ఆపలేడు. ఈరోజు థియేటర్స్ మాఫియా ఎలా ఉందంటే మాఫియా డాన్స్ కంటే దారుణాతి దారుణంగా ఉంది. కేవలం ముగ్గురు నలుగురు చేస్తున్న సినిమాలకి మొత్తం థియేటర్స్ పెట్టుకుంటున్నారు. సాంకేతిక నిపుణులను బతకనిచ్చే పరిస్థితిగానీ, కొత్తవాళ్లు వచ్చే పరిస్థితిగానీ లేకుండా చాలా నీచాతి నీచంగా చేస్తున్నారు. సంక్రాంతి అంటే ఆరేడు సినిమాలు రిలీజ్ అయినా చూడగలిగే ప్రేక్షకులున్నారు.
కానీ, చూడ్డానికి ఒకటి లేదా రెండు సినిమాలు తప్పితే మిగతా సినిమాలకు అవకాశం లేకుండా చేస్తున్న మాఫియా ఉంది. ఈ మాఫియా ఎండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడుగార్లకు చెబుతాం. వాళ్ల సినిమాలే ఆడాలని చూస్తున్నారు. మిగతా వాళ్లందర్నీ తొక్కి పారేస్తున్నారు. మా సినిమాలే ఉండాలి అనే ధోరణిలో వెళుతున్నారు. ఇది మంచిది కాదు. దయచేసి ఇది మీకు విజ్ఞప్తి అనుకోండి.. కాదంటే వార్నింగ్ అనుకోండి.. అయిపోతారు... చాలా మందిని చూశాం. విర్రవీగినోళ్లంతా ఆకాశంలోకి వెళ్లిపోయారు.. మీరు కూడా పోతారు. కొంచెం తెలుసుకుని కరెక్టుగా ఉండండి’’ అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య.. ‘పేట’ కూడా పెద్ద సినిమానే. వాటి మధ్య ఈ సినిమా విడుదల చేస్తున్నాడు అశోక్. ఆ సినిమాలతో పాటు ‘పేట’ కూడా ఆడాలని కోరుకుంటున్నా. రజనీకాంత్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాం. చిరంజీవిగారు, రజనీగారు నటీనటులకు స్ఫూర్తి’’ అన్నారు.
చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ–‘‘ఎందరో మహానుభావులు.. ఇక్కడికి వచ్చిన వారందరికీ వందనాలు. పిలిచినా వస్తానని రాకుండా మమ్మల్ని ఆనందపెట్టిన ఇంకొందరు మహానుభావులకు నా రెండేసి వందనాలు. ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి మధ్య మన సినిమా ‘పేట’ కి థియేటర్స్ తక్కువైనా, బిజినెస్ జరిగినా, జరక్కపోయినా సొంతంగా రిలీజ్ చేద్దామని రిస్క్ తీసుకుని విడుదల చేస్తున్నా’’ అన్నారు.
ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ– ‘‘రజనీగారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ చరిత్ర. అలాంటివాళ్లు అక్కడక్కడా వస్తుంటారు. మనకి మన ఎన్టీ రామారావుగారు. ఆయన ఓ చరిత్ర. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో జపాన్‌లో ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న మొదటి వ్యక్తి రజనీ. సౌత్ ఇండియాలోనూ హీరోలు ఉన్నారని ప్రపం చానికి చాటిన మొదటి హీరో రజనీ ’’అన్నారు.
కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ– ‘‘పేట’ చిత్రం మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్. రజనీసార్ అభిమానులకే కాదు, ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది. మంచి కథ. ఈ పండక్కి చాలా పెద్ద సినిమాల మధ్య మా సినిమా విడుదలవుతోంది. ఆ సినిమాలతో పాటు మా ‘పేట’ కూడా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి, నిర్మాత కిరణ్, సంగీత దర్శకుడు అనిరు«ద్, నటీనటులు బాబీ సింహా, మేఘా ఆకాశ్, మాళవికా మోహన్, పాటల రచయితలు భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment