సినిమా: అనుకున్నవి జరగకపోవడం, ఊహించనివి జరగడం ఇదే జీవితం. అదృష్టం చెప్పిరాదు. దురదృష్టం చెప్పిపోదు. అలా ఎన్నో ఏళ్లుగా సూపర్‌స్టార్‌తో ఒక్క సన్నివేశంలోనైనా నటించే అవకాశం కోసం నటి త్రిష జపం చేసిందనే చెప్పవచ్చు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించి ప్రకటించగానే కాలానే చివరి చిత్రం అనే ప్రచారం జరగడంతో పాపం త్రిష ఇక తన కల కల్లే అనుకున్నారంతా. అదేవిధంగా ఆమె కంటే సీనియర్ నటి సిమ్రాన్. ఆమె ఒక్క రజనీకాంత్ మినహా కోలీవుడ్‌లో ప్రముఖ హీరోలందరితోనూ నటించింది. సూపర్‌స్టార్‌తో నటించలేదన్న కొరత ఈ అమ్మడికీ ఉండేది. అలా సిమ్రాన్, త్రిషలిద్దరి ఆకాంక్షలను రజనీకాంత్ పేట చిత్రంతో తీర్చారు. రెండు మూడు సన్నివేశాల్లో వచ్చి పోయే పాత్రలే అయినా త్రిష, సిమ్రాన్ ఇద్దరూ హ్యాపీ. ఇక వీరిద్దరికంటే యమ ఖుషీ అయిపోతున్న మరో నటి ఉంది. ఆమె మేఘాఆకాశ్. పేట చిత్రం ఈ జాణ జీవితంలో మరపురాని చిత్రంగా నిలిచిపోతోంది.
తెలుగులో రెండు మూడు చిత్రాలు చేసిన మేఘాఆకాశ్ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయ్యింది. ఒరు పక్క కథై చిత్రంతో పరిచయమై, ధనుష్‌తో ఎన్నై నోక్కి పాయుంతోట్టా చిత్రంలో రొమాన్స్ చేసింది. ఇక శింబుతో వందా రాజావాదాన్ వరువేన్ చిత్రంలోనూ డ్యూయెట్లు పాడింది. అయితే ఈ మూడు చిత్రాలు ఇంకా వెండితెరపైకి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేట చిత్రంలో కళాశాల విద్యార్థినిగా నటించే లక్కీచాన్స్‌ను కొట్టేసింది. పేట చిత్రం గురువారం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో నటించిన ఈ పేట చిత్రం ఆమె జీవితంతో విడుదలైన తొలి తమిళ చిత్రంగా నమోదైంది. ఇది మేఘాఆకాశ్ ఊహించనిదే. అయినా జరిగి మధురమైన అనుభూతిని మిగల్చడంతో మేఘ యమ ఖుషీగా పొంగళ్ పండగ చేసుకుంటోంది. అంతేకాదు ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పుకుని తెగ ఆనందపడిపోతోంది. ఈమె సంతోష పడుతున్న మరో విషయం అమ్మడు పనిలో పనిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేసింది. అక్కడ శాట్‌లైట్ శంకర్ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలా 2018 రెండు మరచిపోలేని అవకాశాలను అందించి పోగా, 2019 పేట తొలిచిత్రంగా విడుదలై విజయానందానిచ్చింది. ఇక శింబుతో నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. మొత్తం మీద మేఘాఆకాశ్ ఫుల్‌జోష్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment