సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ సేవల్లో కచ్చితత్వం, పారదర్శకతను రూపొందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ల సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించాలని యోచిస్తోంది. ఇప్పటికే కొన్ని సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రాగా త్వరలో మరికొన్ని కీలక సేవలను ఆన్‌లైన్ చేయనుంది. గతంలో వివాహాల రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది.
ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లోనే వివాహ రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేస్తే నిర్దేశిత సమయంలో సర్టిఫికెట్లను ప్రభుత్వం జారీ చేస్తోంది. హిందూ, ఇతర మతాల వివాహాలను ప్రత్యేకంగా రిజిస్టర్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది. హిందూ వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి ఫాం–ఏ పూర్తి చేసి దానితో పాటుగా వెడ్డింగ్ కార్డు, వివాహ ఫొటో, ఇంటి అడ్రస్ ప్రూఫ్, దంపతుల ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి.
ఆ తర్వాత సాక్షులతో కలిసి రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లి సంతకాలు పెడితే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. స్పెషల్ వివాహాల చట్టం కింద ఇతర సాంప్రదాయాల్లో జరిగే వివాహాలను ఆన్‌లైన్‌లోనే రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. సొసైటీలు, సంస్థల (ఫర్మ్‌లు) రిజిస్ట్రేషన్లు సులభతరం చేసి ఆన్‌లైన్‌లో వాటిని చేసుకునేందుకు అవకాశమిచ్చింది.
‘ఈ–చిట్స్’తో మోసాలకు చెక్
చిట్‌ఫండ్ సంస్థల పేరిట జరుగుతోన్న మోసాలకు చెక్ పెట్టడానికి గాను ‘ఈ–చిట్స్’ పేరుతో రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చింది. చిట్‌ఫండ్ వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉండేలా, ప్రజలకు అన్ని విషయాలు తెలిసేలా ‘ఈ–చిట్స్’కు రూపకల్పన చేసింది. అలాగే చిట్ ఫండ్ సంస్థలు తమ రిజిస్ట్రేషన్లను ఆన్‌లైన్‌లో చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
ఇకపై ఏ చిట్‌ఫండ్ సంస్థ అయినా తమ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తప్పకుండా అప్‌లోడ్ చేయాలి. ఇప్పటికే ఉన్న చిట్‌ఫండ్ సంస్థలు కూడా తాము నిర్వహించే చిట్ గ్రూపుల సమాచారాన్ని త్వరలో ఇందులోనే అప్‌లోడ్ చేయనున్నారు. నోటరీల రిజిస్ట్రేషన్‌నూ ఆన్‌లైన్‌లో చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
వినతులకూ ఆప్షన్..
రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి ప్రజలు వినతులిచ్చేందుకు ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఇచ్చింది. గ్రీవెన్స్ రిడ్రెసల్ విధానంలో ఎవరైనా తమ విన్నపాన్ని ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారులకు ఇచ్చే ఏర్పాటు చేసింది. ఈ వినతులను సంబంధిత విభాగాలు నిర్దేశిత సమయంలో పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లను నేరుగా ఆన్‌లైన్‌లో చేసుకునే విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
వినియోగదారులు తమ డాక్యుమెంట్లను తామే డేటా ఎంట్రీ ద్వారా తయారు చేసుకుని, ఆన్‌లైన్‌లో అవసరమైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటే ఆ సమయంలో ఒక్కసారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న ఈ విధానం త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
కచ్చితత్వం.. పారదర్శకం
Published Wed, Aug 16 2023 2:14 AM | Last Updated on Wed, Aug 16 2023 7:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment