ఇళ్ల పట్టాల కోసం ప్రత్యేక ఉత్తర్వులు | AP Govt Key Decision On House land deeds for 25 lakh people | Sakshi
Sakshi News home page

ఇళ్ల పట్టాల కోసం ప్రత్యేక ఉత్తర్వులు

Published Thu, Feb 13 2020 4:13 AM | Last Updated on Thu, Feb 13 2020 4:13 AM

AP Govt Key Decision On House land deeds for 25 lakh people - Sakshi

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ  ఇళ్లు’ పథకం కింద ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు అందజేసేందుకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నివాస స్థల పట్టాలకు ఐదేళ్ల తర్వాత పూర్తి విక్రయ హక్కులు ఉంటాయి. ఇందుకోసమే దరఖాస్తు (డీకేటీ) పట్టా కాకుండా 25 లక్షల మందికి రూ.10 స్టాంపు పేపర్లపై కన్వేయన్స్‌ డీడ్‌ (రిజిస్ట్రేషన్‌ దస్తావేజు) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారం కన్వేయన్స్‌ డీడ్స్‌ జారీ చేసే అధికారం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లకే ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 295 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో ఆఫీసులో ఒక్కొక్కరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 295 మంది జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లు ఉన్నారు. రాష్ట్రంలోని 670 మండలాల పరిధిలో 25 లక్షల మందికి ఒకేరోజు కన్వేయన్స్‌ డీడ్స్‌ నమోదు చేయడం ఈ 295 మంది జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లతో అయ్యే పనికాదు. అందుకే నవరత్నాల కింద 25 లక్షల మందికి నివాస స్థలాలకు సంబంధించిన కన్వేయన్స్‌ డీడ్స్‌ జారీ అధికారాన్ని రాష్ట్రంలోని 670 మంది తహసీల్దార్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

లబ్ధిదారుల పేరిట కన్వేయన్స్‌ డీడ్స్‌
ప్రత్యేక అవసరార్థం తహసీల్దార్‌ కార్యాలయాలను జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా, తహసీల్దార్లను జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ రిజిస్ట్రేషన్‌ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ డి.సాంబశివరావు బుధవారం జారీ చేసిన వేర్వేరు జీవోల్లో పేర్కొన్నారు. వీటి ప్రకారం తహసీల్దార్లే నివాస స్థలాలకు సంబంధించిన కన్వేయన్స్‌ డీడ్స్‌ జారీ చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ స్టాంపుల ప్రింటింగ్‌ ప్రెస్‌కు (మింట్‌) లేఖ రాసి రూ.10 విలువ గల నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంపులు 25 లక్షలు తెప్పించింది. వీటిపైనే లబ్ధిదారుల పేరుతో కన్వేయన్స్‌ డీడ్స్‌ను తహసీల్దార్లు తయారు చేస్తారు. 

లబ్ధిదారులకు స్థలం బదలాయింపు 
స్థలాన్ని ప్రభుత్వమే లబ్ధిదారుల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తుంది. దీన్నే కన్వేయన్స్‌ డీడ్‌ అంటారు. సాధారణంగా రిజిస్ట్రేషన్‌ చేయాలంటే సదరు ఆస్తి విలువలో 7.5 శాతం రిజిస్ట్రేషన్‌ రుసుముల కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పేదల నుంచి రిజిస్ట్రేషన్‌ రుసుములు వసూలు చేయడం ఇష్టం లేనందున రాష్ట్ర సర్కారు ఈ కన్వేయన్స్‌ డీడ్స్‌కు రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంపు డ్యూటీ, యూజర్‌ ఛార్జీలను మినహాయిస్తూ వేర్వేరు జీవోలు ఇచ్చింది. రూ.10 స్టాంపు పేపర్లపై కన్వేయన్స్‌ డీడ్స్‌ రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడానికి వీలుగా రిజిస్ట్రేషన్‌ శాఖ అన్ని రకాల సేవలకు వాడుకునే కంప్యూటర్‌ ఎయిడెడ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌(కార్డ్‌) డేటాను ఈ ప్రత్యేక అవసరార్థం (కన్వేయన్స్‌ డీడ్స్‌) రిజిస్ట్రేషన్ల కోసం తహసీల్దారు కార్యాలయాలకు సమకూర్చనున్నారు. దీంతో తహసీల్దార్లే జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రారు హోదాలో కన్వేయన్స్‌ డీడ్లను రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఈ ప్రత్యేక పని కోసం మాత్రమే తహసీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదా కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement