మంచిర్యాల సిటీ : మార్చి 25 తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత లేని జవాబు పత్రాలు సరఫరా చేసి చేతులు దులుపుకొంది. దీంతో విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాణ్యతలేని జవాబు పత్రాలను ఉపయోగించడం ద్వారా పరీక్ష రాసే సమయంలో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. విద్యార్థికి నాలుగు పేజీల జవాబు పత్రాలు సరఫరా చేస్తున్నామని చెప్పుకోడానికి గొప్పగా ఉంటుంది.
నాలుగు పేజీల్లో కేవలం రెండు పేజీలు మాత్రమే సద్వినియోగం అవుతాయి. దీంతో విద్యార్థితో పాటు ఇన్విజిలేటర్‌కు సైతం ఇబ్బందులు తప్పవు. పరీక్ష రుసుమును రూ.125 వసూలు చేసిన విద్యాశాఖ నాణ్యతతోపాటు, విద్యార్థికి ఇబ్బందులు లేకుండా జవాబు పత్రాలు ఇవ్వడంలో విఫలమైందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నాణ్యత, ఎక్కువ పేజీలు ఉన్న జవాబు పత్రాలను సరఫరా చేసి విద్యార్థుల ఇబ్బందులను దూరం చేయూల్సిన అవసరం ఉంది.
కేవలం రెండు పేజీలే...
సరఫరా చేసిన నాలుగు పేజీల జవాబు పత్రాల్లో కేవలం మూడు పేజీల్లోనే విద్యార్థులు జవాబులు రాయాల్సి ఉంటుంది. మొదటి పేజీలో పరీక్ష వివరాలు నమోదు చేయనున్న నేపథ్యంలో అధిక శాతం విద్యార్థులు కోడింగ్, డీ కోడింగ్‌ను దృష్టిలో ఉంచుకొని రెండో పేజీలో జవాబులు రాయలేరు. కేవలం రెండు పేజీలను మాత్రమే సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. వంద మార్కుల ప్రశ్న పత్రానికి రెండు పేజీలు సరిపోవు. దీంతో విద్యార్థులు అదన పు పత్రాల కోసం తిప్పలు పడక తప్పదు. అదనపు జవాబు పత్రంలో సైతం నాలుగు పేజీలే ఉంటాయి. అడిగినన్ని జవాబు పత్రాలు ఇచ్చినా ప్రతిభ గల విద్యార్థికి సమయం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్విజిలేటర్‌కు సైతం పని పెరుగుతుంది.
నాణ్యత
విద్యార్థికి సరఫరా చేసిన జవాబు పత్రం నాణ్యత లేనివి కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగితంపై జవాబులు ఒక వైపు రాసిన తరువాత రెండో వైపు రాయడం వలన చినిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. జవాబు పత్రము చించుట గాని, వేరు చేయుటగాని చేయరాదని జవాబు పత్రం మొదటి పేజీలో విద్యాశాఖ అధికారులు పొందుపరిచారు. రాయడం ద్వారా చినిగిన నేపథ్యంలో అందుకు ఎవరు బాధ్యులు అవుతారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఇంటర్‌కు...
దూర విద్య ద్వారా పది, ఇంటర్ చదివి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు పన్నెండు పేజీలతో ఉన్న నాణ్యమైన బుక్‌లెట్‌ను విద్యాశాఖ అధికారులు సరఫరా చేస్తారు. అదేవిధంగా ఇంటర్‌మీడియట్ రెగ్యులర్ విద్యార్థులకు కూడ నాణ్యత కలిగిన 24 పేజీల బుక్‌లెట్‌ను ఇంటర్ బోర్డు అధికారులు సరఫరా చేస్తారు. కానీ రెగ్యులర్ పదో తరగతి విద్యార్థులకు మాత్రం మూడు పేజీల సమాధాన పత్రాలే ఇస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
సమయం
ఎక్కువ పేజీలు ఉన్న సమాధాన పత్రాలను విద్యార్థికి సరఫరా చేసినట్లరుుతే విద్యార్థులకు సమయం ఆదా అవుతుంది. అదనపు పత్రాల కోసం పలుమార్లు ఇన్విజిలేటరు వద్దకు వెళ్లడం ద్వారా విద్యార్థి ఏకాగ్రత దెబ్బతింటుంది.
నష్టం
పలు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న అనారోగ్యకరమైన పోటీ వలన కూడా ప్రతిభ గల విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిభ గల విద్యార్థి రాసిన అదనపు పత్రాల్లోంచి కొన్నింటిని తొలగించినచో ఆ విద్యార్థి నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు సైతం ఉన్నాయి.
నాణ్యత లేని జవాబు పత్రాలు
Published Sat, Mar 14 2015 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM
Advertisement