ట్రిపుల్‌ఐటీ పిలుస్తోంది
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభావంతులకు ట్రిపుల్ ఐటీ సువర్ణావకాశం. మధ్య తరగతి విద్యార్థులు ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో చేరే అవకాశం ఇక్కడ లభిస్తుంది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్‌లైన్ సోమవారం ప్రారంభమైంది. ఎంపికైన విద్యార్థులకు జూన్, జూలై నెలల్లో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో నూజివీడు, ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ కేంద్రాల్లో రెండు దశల్లో ఈ కౌన్సెలింగ్ ఉంటుంది.
సత్తెనపల్లి: జిల్లాలో ఈ ఏడాది 59,478 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 56,345 మంది విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 579 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి పదికి పది జీపీఏ సాధించారు. వీరితో పాటుగా ప్రతిభావంతులైన మిగిలిన గ్రేడ్‌లు సాధించిన విద్యార్థులు కూడా ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దాని ప్రవేశానికి విద్యార్థుల అర్హతను బట్టి ఆన్‌లైన్ ద్వారా జూన్ 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఎవరు అర్హులంటే..
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రతిభావంతులుగా నిలిచిన అన్ని పాఠశాలల విద్యార్థులు అర్హులే. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పది చదివిన విద్యార్థులకు 0.4 జీపీఏ అదనంగా కలిపి కౌన్సెలింగ్‌లో ప్రతిభ నిర్ధారిస్తారు. పదో తరగతి తత్సమానమైన పరీక్షల్లో రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన వారే అర్హులు. ఈ ఏడాది డిసెంబరు నాటికి 18 ఏళ్ల దాటని విద్యార్థులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వయో పరిమితిలో 21 ఏళ్ల వరకు సడలింపు ఉంది.
దరఖాస్తు చేయడమిలా..
ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించాలంటే ఓసీ, బీసీలు రూ. 150, ఎస్సీ, ఎస్టీలు రూ. 100 చెల్లించి ఏపీ ఆన్‌లైన్ ద్వారా మీసేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి హాల్ టికెట్ నంబరు, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్హత, నివాసం, కులం, పదో తరగతి ఉత్తీర్ణత, ఇతర కోటాలకు సంబంధించిన ఆయా ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి.
ఎంపిక విధానం
పదో తరగతిలో విద్యార్థులు సాధించిన గ్రేడ్‌ల వారీగా ఎంపిక ఉంటుంది. ఒక వేళ ఎక్కువ మంది విద్యార్థులు ఒకే గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించి పోటీ పడితే సబ్జెక్టుల వారీగా సాధించిన గ్రేడ్‌లను పరిగణనలోకి తీసుకుంటారు. అయినా పోటీ అనివార్యమైతే పుట్టిన తేదీ ప్రకారం వయసులో పెద్ద వారిని ఎంపిక చేస్తారు. నూజివీడు, ఇడుపులపాయ, ట్రిపుల్ ఐటీ సంస్థల్లో వెయ్యేసి చొప్పున సీట్లు ఉన్నాయి. వాటి ఆధారంగా వికలాంగులకు మూడు శాతం, సైనిక విభాగంలో రెండు శాతం, ఎన్‌సీసీ విభాగంలో ఒక శాతం, క్రీడా కోటాలో 0.5 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. మిగిలిన వాటిల్లో ఓపెన్ కేటగిరీ ద్వారా ప్రాంతాల వారీగా సీటిస్తారు.
రుసుము చెల్లింపులు ఇలా
రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ. 36 వేలు ఫీజు చెల్లించాలి. విద్యార్థులు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైతే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల పిల్లలు, రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేని విద్యార్థులు తప్పనిసరిగా రుసుము చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. వెయ్యి, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ. 500 చెల్లించాలి. డిపాజిట్ కింద రూ. 2 వేలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.
వసతి సౌకర్యం
ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులకు వసతి, భోజన సదుపాయం, పుస్తకాలు, లాప్‌ట్యాప్, రెండు జతల యూనిఫాం, బూట్లు ఇస్తారు. ప్రభుత్వ రాయితీలను అనుసరించి ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.