
ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులోకి..
నూజివీడు: రాబోయే విద్యాసంవత్సరం నుంచి 4 ట్రిపుల్ ఐటీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు మైనర్ డిగ్రీ కింద క్వాంటమ్ టెక్నాలజీ కోర్సును అందుబాటులోకి తేనున్నారు. ఇటీవల సమావేశమైన ఆర్జీయూకేటీ 72వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ శనివారం తెలిపారు.
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు జీతాల పెంపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, ల్యాబ్ అసిస్టెంట్‌లకు ఎంటీఎస్ ఇవ్వాలని వచ్చిన కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతామని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ కోర్సులు చదువుకునేందుకు అనుమతిస్తామన్నారు.