‘పది’ ఇంటర్నల్స్‌ను ఇక పరిగణించరు!
టెన్త్ ఇంటర్నల్స్‌లో 7 మార్కులు వస్తేనే పాస్ అన్న నిబంధన తొలగింపు
వాటి మార్కులను పరిగణనలోకి తీసుకోకూడదని సర్కారు నిర్ణయం
80 మార్కుల్లో 35 శాతం వస్తే ఉత్తీర్ణత పొందినట్టే
మారనున్న గ్రేడింగ్ విధానం.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక
హైదరాబాద్: సంస్కరణల్లో భాగంగా పదో తరగతి పరీక్షల్లో పలు మార్పులకు సర్కారు శ్రీకారం చుట్టింది. ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్స్‌కు ఇచ్చే 20 మార్కులను సదరు విద్యార్థి పాస్/ఫెయిల్‌లో పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయానికి వచ్చింది. 80 మార్కులకు నిర్వహించే పబ్లిక్ పరీక్షలో కనీసం 28 మార్కులతోపాటు (35%) ఇంటర్నల్స్‌లోనూ కనీసంగా 7 మార్కులు వస్తేనే ఆ సబ్జెక్టులో విద్యార్థి ఉత్తీర్ణత సాధించినట్టుగా పరిగణించాలనే నిబంధనను తొలగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇంటర్నల్స్‌కు ఇచ్చే మార్కులను పరిగణనలోకి తీసుకుంటే విద్యార్థులను టీచర్లు బెదిరించే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రెండు చొప్పున పేపర్లు ఉండే సైన్స్, మ్యాథ్స్, సోషల్ సబ్జెక్టుల్లో వేర్వేరుగా కాకుండా రెండు పేపర్లలో కలిపి 35 శాతం మార్కులు వస్తే చాలు. 40 మార్కులకు నిర్వహించే ఒక్కో పేపరులోనూ 35 శాతం చొప్పున మార్కులు వస్తేనే పాస్ అనే నిబంధనను కూడా తొలగించనుంది. ఒక్క పేపరు మాత్రమే ఉండే తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో మాత్రం 80 మార్కులకు గాను 28 మార్కులు (35%) మార్కులు వస్తే పాస్ అన్న పాత నిబంధననే కొనసాగించాలని నిర్ణయించింది. పాఠశాల విద్యా డెరైక్టరేట్‌లో బుధవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పదో తరగతి పరీక్షల సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం గత మే నెలలో జారీ చేసిన ఉత్తర్వుల్లో చేయాల్సిన సవరణలపై చర్చించారు.
పరీక్షల్లో తీసుకురావాల్సిన సవరణలపై ఈనెల 18న పాఠశాల విద్యా డెరైక్టర్‌కు ప్రతిపాదనలు అందజేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనున్నారు. ఇందుకు అనుగుణంగా గ్రేడింగ్ విధానాన్ని కూడా మార్పు చేయాలని ప్రతిపాదించనున్నారు. ఎస్‌ఎస్‌సీ కాంపోజిట్ కోర్సులో అరబిక్, పర్షియన్ వంటి ఇతర భాషలను ఆంగ్ల మీడియం విద్యార్థులు ఎంచుకుంటున్నారు. ఇది త్రిభాషా సిద్ధాంతానికి వ్యతిరేకమవుతోంది. నాలుగో భాషను అనుమతించాలా.. లేదా? అనే అంశంపై చర్చించినా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ఇతర రాష్ట్రాలవారు ద్వితీయ భాషగా స్పెషల్ ఇంగ్లిష్‌ను (11ఈ) ఎంచుకోవడాన్ని తొలగించనున్నారు. ఇప్పటివరకు హిందీలో కనీసం 20 మార్కులు వస్తే పాస్ అనే నిబంధన ఉంది. సంస్కరణల నేపథ్యంలో హిందీలోనూ 28 మార్కులు రావాల్సిందే. కాగా, విద్యార్థి పాస్/ఫెయిల్ నిర్ధారణలో ఇంటర్నల్స్ మార్కులను పరిగణనలోకి తీసుకోకపోయినా పాఠశాలల్లో ఏడాదికి నాలుగుసార్లు ఇంటర్నల్స్ నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలను జారీ చేయనుంది.