నేటినుంచి పదో తరగతి పరీక్షలు
సమయం : ఉ.9.30 - మ.12 వరకు
రెగ్యులర్ విద్యార్థులు : 52,500 మంది
ప్రైవేటు విద్యార్థులు :7,800 మంది
పరీక్ష కేంద్రాలు : 296
ఇబ్బందులుంటే కాల్ చేయండి : 92911 06999
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 11వ తేదీతో ముగిసే ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని డీఈవో డి.దేవానందరెడ్డి చెప్పారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి తొమ్మిది గంటల నుంచి అనుమతిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 296 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెగ్యులర్‌గా 52,500 మంది, ప్రైవేటుగా 7,800 మంది.. మొత్తం 60,300 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు కేంద్రాలను పర్యవేక్షిస్తారు. 3,500 మంది ఇన్విజిలేటర్లు, 14 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 25 సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులుంటే తెలుసుకునేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెల్ 24 గంటలపాటు పనిచేస్తుంది. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే 9291106999 నంబరుకు కాల్ చేయాలని డీఈవో కోరారు.
ఇప్పటికే వచ్చిన ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు దగ్గరలోని పోలీస్‌స్టేషన్లకు తరలించామని, రూట్ ఆఫీసర్ల ద్వారా కేంద్రాలకు తీసుకువెళతామని పేర్కొన్నారు. ప్రతి కేంద్రం వద్ద ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. కేంద్రాల్లో విద్యుత్‌కోత లేకుండా ఆ శాఖ అధికారులతో మాట్లాడామన్నారు. ఆర్టీసీ అధికారులతో చర్చించి బస్సులను సకాలంలో నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని కేంద్రాల్లో బల్లలు ఏర్పా టు చేశామన్నారు.
ఇలా చేయండి...
పరీక్షల సమయంలో ఒంటిరిగా కాకుండా మీకు నచ్చిన తోటి విద్యార్థులతో కలిసి చదువుకోండి.
బాతాఖానీలు పెట్టకుండా చదివితే అనుమానాలు నివృత్తి అవుతాయి. పరీక్ష బలంగా రాసే ధైర్యం వస్తుంది.
బాగా కష్టమైన ప్రశ్నలను ఒకటికి నాలుగుసార్లు చదువుకుని చిత్తుపుస్తకంలో రాసుకోండి. క్షణాల్లో మీకు జవాబు వచ్చేస్తుంది.
ఇవి తీసుకెళ్లండి..
నిర్ణీత సమయానికంటే ముందే పరీక్ష కేంద్రానికి వెళ్లాలి.
హాల్‌టికెట్ మరవకూడదు.
పెన్నులు, పెన్సిళ్లు, స్కేల్, స్కెచ్ పెన్నులు తీసుకెళ్లాలి.