* రెండు రాష్ట్రాలకు కలిపి రెండు విడతల్లో నిర్వహణ
* మలివిడత ఫిబ్రవరి 2నుంచి ప్రారంభం
* షెడ్యూల్ విడుదల చేసిన కన్వీనర్ సురేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: డిస్ట్రిక్ట్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రయినింగ్, ఎలిమెంటరీ టీచర్ ట్రయినింగ్ ఇనిస్టిట్యూట్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డైట్‌సెట్) కౌన్సెలింగ్ జనవరి ఏడో తేదీనుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు డైట్‌సెట్ కన్వీనర్ ఎన్.సురేందర్‌రెడ్డి మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. జనవరి ఏడో తేదీనుంచి తొలివిడత, ఫిబ్రవరి రెండో తేదీనుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కలిపి ఉమ్మడిగా ఈ కౌన్సెలింగ్ జరుగుతుంది.
ఈ కౌన్సెలింగ్‌కోసం గత ఆరునెలలుగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. దీని ద్వారా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఐఈడీ) కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు. డీఈడీ కాలేజీలకు సంబంధించిన జాబితా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే అందించింది. ఏపీ నుంచి 409 కాలేజీలకు సంబంధించిన జాబితా డైట్‌సెట్ కన్వీనర్‌కు అందింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ జాబితా రాలేదు. దీంతో రెండు విడతల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి అయిదో తేదీ నాటికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా కాలేజీల జాబితా అందితే వాటిని తొలివిడత కౌన్సెలింగ్‌లో చేరుస్తారు. లేనిపక్షంలో ఫిబ్రవరి రెండో తేదీనుంచి ప్రారంభమయ్యే రెండో విడత కౌన్సిలింగ్‌లో వాటిని చేరుస్తారు.
ఈ ఉమ్మడి కౌన్సెలింగ్ కోసం తెలంగాణ పరీక్షల విభాగం అడిషనల్ డెరైక్టర్ గోపాల్‌రెడ్డిని కో కన్వీనర్‌గా ఆ ప్రభుత్వం నియమించింది. జనవరి ఆరో తేదీన కాలేజీల జాబితా, కౌన్సెలింగ్ విధివిధానాలు డైట్ సెట్ ర్యాంకులు ఇతర వివరాలను http:\\ dietcet.cgg.gov.in అనే వెబ్‌సైట్లో పెట్టనున్నారు. డైట్‌సెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తాము కోరుకుంటున్న కాలేజీలకు వెబ్ ఆప్షన్లను జనవరి ఏడో తేదీ నుంచి పదో తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు.
జనవరి 7నుంచి డైట్‌సెట్ కౌన్సెలింగ్
Published Wed, Dec 31 2014 2:55 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
Advertisement
Advertisement