అనంతపురం, రాయదుర్గం టౌన్ :‘విద్యాహక్కు చట్టం 2009’ ప్రకారం ఉపాధ్యాయ కోర్సుల్లో శిక్షణ పొందని వారు స్కూళ్లలో పాఠ్యాంశాలు బోధించేందుకు అనర్హులు. ఈ నిబంధన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు వర్తిస్తుంది. ఇప్పటి వరకూ ఎలాంటి శిక్షణ పొందకుండా పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ డిప్లొమా ఇన్ లెర్నింగ్ ఎడ్యుకేషన్(డీఎల్‌ఈడీ) కోర్సు దూరవిద్య ద్వారా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2019 మార్చి 31లోపు జాతీయ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా డీఎల్‌ఈడీ కోర్సును పూర్తి చేసిన వారు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధించే అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రకటించారు. 2019 తర్వాత శిక్షణ పొందని ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి అన్ ట్రైన్డ్ టీచర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 30లోపు పూర్తి చేయాలని డీఈఓలకు ఆదేశాలు అందాయి.
30లోపు ఫీజు చెల్లించాలి
శిక్షణ పొందని ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబ్‌సైట్‌లో ఈ నెల 30లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల డేటాను ఆయా జిల్లాల డీఈఓలు ధ్రువీకరించి ఆ తర్వాత దాన్ని జాతీయ సార్వత్రిక విద్యాపీఠం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. అనంతరం రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను సార్వత్రిక విద్యాపీఠం వారు ఎస్‌ఎంఎస్ రూపంలో అభ్యర్థులకు సమాచారం అందిస్తారు. అనంతరం మొదటి సంవత్సరం కోర్సు ఫీజు రూ.4,500 ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఇలా...
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో టీచర్ కార్నర్ క్లిక్ చేసి ఎన్‌ఐఓవీ అన్ ట్రైన్డ్ టీచర్స్ రిజిస్ట్రేషన్ కాలం క్లిక్ చేయాలి. అక్కడ ప్రొ ఫారం–1 లో ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల మేనేజ్‌మెంట్, ప్రొఫారం–2 లో ఎయిడెడ్ అన్‌ఎయిడెడ్, ప్రైవేటు మేనేజ్‌మెంట్ టీచర్స్ కాలంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులైతే టీచర్ కోడ్‌తో, ప్రైవేటు పాఠశాలల టీచర్స్ స్కూల్ యూడైస్ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదే చివరి అవకాశం
డీఎల్‌ఈడీ కోర్సుకు సంబంధించి యూడైస్ మేరకు జిల్లాలో 189 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందువల్ల రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో ఉంది. ఇప్పటి దాకా 55.5 శాతం మంది ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించారు. మిగతా వారు కూడా గడువులో ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేనిపక్షంలో అలాంటి టీచర్స్‌ను తొలగిస్తాం.
– లక్ష్మీనారాయణ, డీఈఓ