అగ్ని‘పరీక్ష’ !
నేటినుంచే త్రైమాసిక పరీక్షలు, ఉపాధ్యాయ శిక్షణ
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయం ఉపాధ్యాయులకు అగ్నిపరీక్షలా మారింది. శిక్షణలు, పరీక్షలు, కార్యక్రమాలు ఇలా అన్నీ ఒకేసారి నిర్వహించి ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్నారు. సోమవారం నుంచి త్రైమాసిక పరీక్షలు, ఆర్‌ఎంఎస్‌ఏ శిక్షణ కార్యక్రమాలు వరుసగా నిర్విహ స్తుండడంతో ఉపాధ్యాయులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణలు నిర్వహిస్తున్నారు.
మొదటి విడత 15 వరకు, రెండోవిడత 18వ తేదీ వరకు నిర్వహిస్తుండడంతో సగంమందికిపైగా ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాల్లో నిమగ్నమవడంతో త్రైమాసిక పరీక్షల నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈనెల 8 నుంచి 27వ తేదీ వరకు పాఠశాలల్లో ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాలను చేపట్టాలని అదే విద్యాశాఖ ఆదేశించడంతో ఇన్ని కార్యక్రమాల మధ్య త్రైమాసిక పరీక్షలను ఎలా నిర్వహించాలని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 14 వరకు ఎల్‌ఈపీ-3ఆర్‌లో భాగంగా విద్యార్థులకు బేసిక్స్ నేర్పమనడంతో, పూర్తిగా సిలబస్ పూర్తికాకపోవడం వల్ల త్రైమాసిక పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియక విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
త్రైమాసిక పరీక్షల సమయంలో సబ్జెక్టు ఉపాధ్యాయులు పాఠశాలల్లో లేకపోతే ప్రశ్నాపత్రంలో వచ్చే సందేహాలను ఎవరు తీరుస్తారని విద్యార్థులు మదనపడుతున్నారు. ఇవి చాలవన్నట్లు అక్టోబర్ 24వ తేదీలోపు డైస్ కార్యక్రమాలు పూర్తిచేయాలని షెడ్యూల్‌ను రూపొందించడంతో ఏ పని చేయాలో తెలియక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
త్రైమాసిక పరీక్షల నేపథ్యంలో ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదావేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి అస్తవ్యస్తంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై డీఈఓ చంద్రమోహన్‌ను వివరణ కోరగా.. పాఠశాలల్లో త్రైమాసిక పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు తగినచర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేయొద్దు
ఏకకాలంలో అనేక కార్యక్రమాలను ఉపాధ్యాయులపై రుద్ది వారిని ఆందోళన గురిచేయవద్దని ఎస్‌టీయూ టీఎస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ప్రపుల్లా చంద్ర డిమాండ్‌చేశారు. విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్లు సమన్వయంతో పనిచేస్తూ ఉపాధ్యాయులకు గందరగోళ పరిస్థితులు కల్పించకుండా చూడాలని, శిక్షణ లో పాల్గొనే ఉపాధ్యాయులకు నిబంధనల ప్రకారం టీఏ, డీఏలు చెల్లించాలని డిమాండ్‌చేశారు.