అన్‌ట్రైన్డ్ టీచర్లూ అర్హత పొందాల్సిందే
► 2019 మార్చి 31కల్లా ఉపాధ్యాయ శిక్షణ తప్పనిసరి
► లేదంటే బోధించడానికి వీల్లేదని స్పష్టం చేసిన ఎంహెచ్‌ఆర్‌డీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు సహా ఏ పాఠశాలలో బోధించాలన్నా తప్పనిసరిగా ఉపాధ్యాయ శిక్షణ పొంది ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే బోధిస్తున్న అన్‌ట్రైన్డ్ టీచర్లు కూడా తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలని.. 2019 మార్చి 31వ తేదీలోగా వారంతా అర్హత సంపాదించాలని సూచించింది. లేదంటే వారిని పాఠశాలల నుంచి తొలగించాలని, అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టడంపై దృష్టి సారించింది.
పెద్ద సంఖ్యలో..: రాష్ట్రంలో 25,750 వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 1,09,022 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారంతా ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తిచేసిన వారే. 720 ఎయిడెడ్ పాఠశాలల్లో 3,177 మంది టీచర్లు పనిచేస్తుండగా.. అందులో 25 మంది అన్‌ట్రైన్డ్ టీచర్లున్నారు. ఇక 11,262 ప్రైవేటు పాఠశాలల్లో 92,675 మంది టీచర్లుండగా.. ఇందులో 3,905 మంది ఉపాధ్యాయ శిక్షణ పొందలేదని యూ–డైస్ లెక్కల ప్రకారం విద్యా శాఖ గుర్తించింది. వారంతా వచ్చే నెల 15వ తేదీలోగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో చేరేలా చర్యలు చేపట్టాలని ప్రైవేటు పాఠశాలలకు సూచించింది. లేదంటే కేంద్రం ఆదేశాల మేరకు వారిని ఉపాధ్యాయ వృత్తి నుంచి తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
మార్కుల శాతం పెంచుకోవాల్సిందే
ప్రస్తుతం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో చేరేందుకు ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలన్న నిబంధన ఉంది. అయితే ఆయా టీచర్లు ఎప్పుడో ఇంటర్, డిగ్రీలు కోర్సులు పూర్తి చేసి ప్రైవేటు స్కూళ్లలో చేరి ఉంటారు. వారిలో ఎవరికైనా ఇంటర్‌లో 50 శాతం మార్కులు లేకపోతే.. ఇప్పుడు తిరిగి దూర విద్యా విధానంలో ఇంటర్ చదివి.. ఉపాధ్యాయ విద్య కోర్సు పూర్తయ్యే లోగా నిర్ణీత మార్కులను సాధించాలని కేంద్రం స్పష్టం చేసింది.
శిక్షణ పొందని వారు భారీ సంఖ్యలోనే!
ప్రైవేటు పాఠశాలల్లో అన్‌ట్రైన్డ్ టీచర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని, కానీ స్కూళ్లు వివరాలు సరిగా ఇవ్వకపోవడంతో కేవలం 3,905 మందే లెక్కతేలుతున్నారని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం 23 లక్షల మంది విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే 1,09,022 మంది టీచర్లున్నారు. అయినా టీచర్లు సరిపోవడం లేదన్న డిమాండ్ ఉంది.
అలాంటిది 31 లక్షల మంది విద్యార్థులు చదువుతున్న ప్రైవేటు పాఠశాలల్లో 92,672 మందే టీచర్లున్నారా.. అనే ప్రశ్న తలెత్తుతోంది. అధికారికంగా ప్రైవేటు పాఠశాలలు ఇచ్చిన లెక్క అంతేనని, వాస్తవంగా మరో 30వేల మందికిపైగా టీచర్లు పనిచేస్తున్నారని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అధికారికంగా వారిని వివరాల్లో చూపిస్తే నిబంధనల ప్రకారం ప్రయోజనాలు కల్పించాల్సి వస్తుందనే లెక్కలు చెప్పడం లేదేమోనని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.