State Education Department
-
పని ప్రదేశాల్లో అతివలకు అండగా..
సాక్షి, ఖమ్మం: సమాజంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలకు ఇంకా ఎక్కువ సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా పని ప్రదేశాల్లో వేధింపులను గుర్తించి మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు అంతర్గత కమిటీలను నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వేధింపులను నివారించటానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు కార్యాలయాల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయటానికి సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పటికే ఉన్నతాధికారులకు పలువురి ఫిర్యాదులు జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల తదితర చోట్ల సుమారు 10వేల మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారుల అంచనా. పని ప్రదేశాల్లో వీరిని పురుష ఉద్యోగులు వివక్షకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని కొందరు మహిళా ఉద్యోగులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన సంఘటనలున్నాయి. మరికొంత మంది వేధింపులకు గురవుతున్నా విన్నవించుకునేందుకు ధైర్యం చేయలేని పరిస్థితి ఉంది. ఇలాంటి వారికి అండగా ఉండేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కమిటీ నిర్వహణ ఇలా.. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో పది మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న చోట కమిటీలు ఏర్పాటుచేసుకోవాలి. దీనిలో అనుభవం కలిగిన అధికారిని కమిటీ చైర్మన్గా నియమిస్తారు. మండలాల్లోని కార్యాలయాల్లో నియమించిన కమిటీ సభ్యుల నుంచి జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న సహచర ఉద్యోగుల నుంచి వేధింపులు, ఒత్తిడులు ఎదురైతే కమిటీ సమావేశమై చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. ఒక వేళ సంబంధిత ఉద్యోగులు అప్పటికీ వేధింపులు మానుకోకపోతే కమిటీ సభ్యులు అంతా చర్చించి అతనిపై చర్యలు తీసుకుంటారు. ఈ కమిటీలు ఏర్పాటు చేయటం వల్ల మహిళా ఉద్యోగులకు వేధింపులు అరికట్టటానికి అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల, ఏదైనా పది మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటే తప్పనిసరిగా కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. లేనిపక్షంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంటామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటు చేయకుంటే జరిమానా మహిళా ఉద్యోగినిలు 10మంది కంటే ఎక్కువగా ఉండి.. అక్కడ మహిళలకు సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయకుంటే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. కమిటీ ఏర్పాటు చేయకపోవడం వల్ల రూ.50వేలు జరిమానా విధించనున్నారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసే కమిటీల నియామకంపై తాత్సారం చేయవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అవగాహన సదస్సులు బాలికలు, యువతులు, విద్యార్థినులు, మహిళలపై వేధింపులు అధికంగా ఉంటున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడితే కలిగే నష్టాలు, కేసులు, చట్టాల గురించి పోలీస్ శాఖాధికారులు షీ టీమ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలు, ప్రయాణ ప్రాంగణాలపై షీ టీమ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మహిళలపై దాడులు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు, చిన్న పిల్లల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధానం అమలు చేయడం వల్ల జిల్లాలోని పోకిరీల ఆగడాలకు కొంత అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి పది మంది మహిళా ఉద్యోగినిలు ఉంటే తప్పకుండా కమిటీ ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించిన ఆదేశాలు మాకు అందాయి. కమిటీ ఏర్పాటు చేయని పక్షంలో రూ.50వేల జరిమానా విధించాలని మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే మా శాఖ కార్యాలయంలో కమిటీ ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో సైతం కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. –మదన్మోహన్, ఖమ్మం డీఈఓ -
అన్ట్రైన్డ్ టీచర్లూ అర్హత పొందాల్సిందే
► 2019 మార్చి 31కల్లా ఉపాధ్యాయ శిక్షణ తప్పనిసరి ► లేదంటే బోధించడానికి వీల్లేదని స్పష్టం చేసిన ఎంహెచ్ఆర్డీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు సహా ఏ పాఠశాలలో బోధించాలన్నా తప్పనిసరిగా ఉపాధ్యాయ శిక్షణ పొంది ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే బోధిస్తున్న అన్ట్రైన్డ్ టీచర్లు కూడా తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలని.. 2019 మార్చి 31వ తేదీలోగా వారంతా అర్హత సంపాదించాలని సూచించింది. లేదంటే వారిని పాఠశాలల నుంచి తొలగించాలని, అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టడంపై దృష్టి సారించింది. పెద్ద సంఖ్యలో..: రాష్ట్రంలో 25,750 వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 1,09,022 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారంతా ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తిచేసిన వారే. 720 ఎయిడెడ్ పాఠశాలల్లో 3,177 మంది టీచర్లు పనిచేస్తుండగా.. అందులో 25 మంది అన్ట్రైన్డ్ టీచర్లున్నారు. ఇక 11,262 ప్రైవేటు పాఠశాలల్లో 92,675 మంది టీచర్లుండగా.. ఇందులో 3,905 మంది ఉపాధ్యాయ శిక్షణ పొందలేదని యూ–డైస్ లెక్కల ప్రకారం విద్యా శాఖ గుర్తించింది. వారంతా వచ్చే నెల 15వ తేదీలోగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో చేరేలా చర్యలు చేపట్టాలని ప్రైవేటు పాఠశాలలకు సూచించింది. లేదంటే కేంద్రం ఆదేశాల మేరకు వారిని ఉపాధ్యాయ వృత్తి నుంచి తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మార్కుల శాతం పెంచుకోవాల్సిందే ప్రస్తుతం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో చేరేందుకు ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలన్న నిబంధన ఉంది. అయితే ఆయా టీచర్లు ఎప్పుడో ఇంటర్, డిగ్రీలు కోర్సులు పూర్తి చేసి ప్రైవేటు స్కూళ్లలో చేరి ఉంటారు. వారిలో ఎవరికైనా ఇంటర్లో 50 శాతం మార్కులు లేకపోతే.. ఇప్పుడు తిరిగి దూర విద్యా విధానంలో ఇంటర్ చదివి.. ఉపాధ్యాయ విద్య కోర్సు పూర్తయ్యే లోగా నిర్ణీత మార్కులను సాధించాలని కేంద్రం స్పష్టం చేసింది. శిక్షణ పొందని వారు భారీ సంఖ్యలోనే! ప్రైవేటు పాఠశాలల్లో అన్ట్రైన్డ్ టీచర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని, కానీ స్కూళ్లు వివరాలు సరిగా ఇవ్వకపోవడంతో కేవలం 3,905 మందే లెక్కతేలుతున్నారని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం 23 లక్షల మంది విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే 1,09,022 మంది టీచర్లున్నారు. అయినా టీచర్లు సరిపోవడం లేదన్న డిమాండ్ ఉంది. అలాంటిది 31 లక్షల మంది విద్యార్థులు చదువుతున్న ప్రైవేటు పాఠశాలల్లో 92,672 మందే టీచర్లున్నారా.. అనే ప్రశ్న తలెత్తుతోంది. అధికారికంగా ప్రైవేటు పాఠశాలలు ఇచ్చిన లెక్క అంతేనని, వాస్తవంగా మరో 30వేల మందికిపైగా టీచర్లు పనిచేస్తున్నారని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అధికారికంగా వారిని వివరాల్లో చూపిస్తే నిబంధనల ప్రకారం ప్రయోజనాలు కల్పించాల్సి వస్తుందనే లెక్కలు చెప్పడం లేదేమోనని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. -
రూ. 2 వేల కోట్లతో ఎస్ఎస్ఏ కార్యక్రమాలు
ఆమోదం తెలిపిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు 110 కేజీబీవీలు, 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ఓకే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద రూ. రెండు వేల కోట్లకు పైగా నిధులతో విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) ఓకే చెప్పింది. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పీఏబీ రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలకు ఓకే చెప్పింది. 2017–18 విద్యా సంవత్సరంలో చేపట్టే విద్యా కార్యక్రమాలకు వెచ్చించే ఈ మొత్తంలో కేంద్రం 60 శాతం నిధులను ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను వెచ్చించనుంది. వాస్తవానికి రాష్ట్ర విద్యా శాఖ రూ. 2,933 కోట్లతో ప్రతిపాదనలు పంపించినా, సివిల్ వర్క్స్కు నిధులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. వాటిని తొలగించి రూ. 2 వేల కోట్ల రాష్ట్ర ప్రణాళికలను ఓకే చేసింది. ఇందులో అత్యధికంగా రూ. 1,064 కోట్లు 20,823 మంది టీచర్ల వేతనాల కింద ఇచ్చేందుకే వెచ్చించనున్నారు. ఇప్పటికే ఉన్న 391 కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల (కేజీబీవీ) అభివృద్ధికి రూ. 264 కోట్లు వెచ్చించనున్నారు. వీటికి అదనంగా రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన 125 మండలాల్లో విద్యా పరంగా వెనుకబడిన 110 మండలాల్లోనూ కేజీబీవీల ఏర్పాటుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్, ఖమ్మంలో వీధి బాలలు, అనాథ విద్యార్థుల కోసం అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా, మిగతా జిల్లాల్లోని పట్టణ కేంద్రాల్లో మరో 29 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు అంగీకరించింది. ఈసారి పాఠ్య పుస్తకాలకు కూడా నిధులను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. -
పాఠశాల ప్రవేశాలకు ప్రత్యామ్నాయం
* వయసుకు సంబంధించిన గందరగోళానికి తెర * 9 నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్లు పుణే: పాఠశాల అడ్మిషన్లలో వచ్చే ఏడాది నుంచి ఒకే వయో పరిమితిని అమలు చేయనుండటంతో ఈ ఏడాది అడ్మిషన్లకు రాష్ట్ర విద్యాశాఖ మరో మార్గం ఆలోచించింది. అడ్మిషన్ సమయంలో వయస్సుకు సంబంధించిన గందరగోళాన్ని తొలగించడానికి ఈమేరకు ఓ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ సమయంలో పాఠశాలలు విద్యార్థుల వయస్సు వివరాలు విడివిడిగా ఇవ్వాలని, ఆ ప్రకారమే అడ్మిషన్లు జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ డెరైక్టర్ మహావీర్ మనే శనివారం తెలిపారు. నాసిక్లో ఈ నెల 9 నుంచి 14 వరకు జరగనున్న రిజిస్ట్రేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తులు 16 నుంచి 28 వరకు స్వీకరిస్తారు. పుణే, పింప్రి, చించ్వాడ్, ముంబై, థాణే, కల్యాణ్ దోంబివలి, నాగ్పూర్, భీవండి-నిజాంపూర్, ఉల్హస్నగర్, మిరా-భయందర్, నవీ ముంబై, అమరావతి, లాతూర్, ఔరంగాబాద్, కొల్హాపూర్లలో ఈ నెల 16 నుంచి 21 వరకు ఈ పద్ధతి కొనసాగుతుందని అధికారులు వివరించారు. ఆన్లైన్లో దరఖాస్తులు ఫిభ్రవరి 23 నుంచి మార్చి 7 వరకు స్వీకరిస్తారని వారు వెల్లడించారు. డిప్యూటీ డెరైక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ వెరిఫికేషన్ సెంటర్ను సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు (rte25admission. maharashtra.gov.in)ను సంప్రదించాలని చెప్పారు. ఆర్టీఈ చట్టం ప్రకారం చేరిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.26 కోట్ల ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. ఓ ప్రైవేటు ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులపై జరిగిన అత్యాచార కేసు విషయంలో దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రాథమిక విద్యాశాఖ డెరైక్టర్ మహావీర్ మానే తెలిపారు. అయితే గతంలో మూడు పాఠశాలల్లో జరిగిన లైంగిక వేధింపుల కేసు పురోగతి గురించి ప్రశ్నించగా చివరి నివేదిక సమర్పించడానికి సంబంధిత విద్యాశాఖ అధికారులకు వారం రోజులు గడువిచ్చినట్లు తెలిపారు.