సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలు ఇంకా లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అత్యవసర వైద్య సేవలు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ముఖ్యంగా కాన్పు సమయంలో తల్లులు, శిశువుల పరిరక్షణ సవాల్‌గా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రకాల కార్యక్రమాలను అమలుచేస్తున్నా మాతాశిశు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో మాతాశిశు సంరక్షణ ఆందోళనకరంగానే ఉందని స్పష్టమవుతోంది. మన రాష్ట్రంలోని పాత జిల్లాల ప్రాతిపదికన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆ సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది.
రాష్ట్రంలో జరిగే ప్రతి లక్ష కాన్పులలో 92 మంది తల్లులు చనిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రసవ సమయంలో తల్లుల మరణాలరేటు ఎక్కువగా ఉంది. అక్కడ ప్రతి లక్షకు 152 మంది తల్లులు మరణిస్తున్నారు. హైదరాబాద్‌లో మరణాల సంఖ్య 71 ఉంది. చిన్న వయసులో పెళ్లిళ్లు, రక్తహీనత బాలింతల మరణాలకు ఎక్కువగా కారణమవుతోంది. గర్భిణులలో 51 శాతం మందికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఔషధాలు చేరడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కాన్పు సమయంలో రక్తస్రావం జరిగితే అందుబాటులో రక్తం లేకపోవడం వల్ల బాలింతల మరణాలు పెరుగుతున్నాయి. గర్భంలోని శిశువు పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమయ్యే స్కానింగ్ వ్యవస్థ గ్రామాల్లో లేకపోవడం వల్ల కాన్పు సమయంలో ఎక్కువ సమస్యలు వచ్చి మరణాలు జరుగుతున్నాయి.
శిశుమరణాల పరిస్థితి సైతం రాష్ట్రంలో ఇలాగే ఉంది. రాష్ట్రంలో జన్మించే ప్రతి వెయ్యి మంది శిశువులలో 30 మంది చనిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మరణాల సంఖ్య 38, పట్టణ ప్రాంతాల్లో 20గా ఉంది. కాన్పు సమయం నుంచి కొన్ని రోజులలోపు ఇలా శిశువులు చనిపోతున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే శిశు మరణాల రేటు మన రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతోంది. కేరళలో 12, తమిళనాడులో 21 మంది శిశువులు చనిపోతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో శిశు మరణాల రేటు మరీ ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ప్రతి వెయ్యి మంది శిశువులలో 53 మంది మరణిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సంఖ్య 20గా ఉంది. ప్రభుత్వం కొత్తగా ఆస్పత్రులను నిర్మిస్తున్నా అవసరమైన మేరకు సిబ్బంది లేకపోవడంతో శిశు మరణాల సంఖ్య తగ్గడం లేదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాన్పులు చేసే ఆస్పత్రులలో కచ్చితంగా స్త్రీ వైద్య నిపుణులు, పిల్లల వైద్యుడు, మత్తు డాక్టరు ఉండాలి. 70 శాతం ఆస్పత్రులలో మత్తు వైద్యులు లేరు. మూడు కేటగిరీల వైద్యులు ఉన్న ఆస్పత్రులు తక్కువగా ఉండటమే మాతాశిశు మరణాలకు కారణమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment