సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలతో తెలంగాణ వైద్య, ఆరోగ్య రంగంలో గుణాత్మక మార్పులు వచ్చాయని రాష్ట్ర, ఐటీ పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందని, అన్ని సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు పెరిగాయని చెప్పారు.
మొత్తంగా ప్రభుత్వ వైద్య సేవలతో ‘నేనొస్త బిడ్డో సర్కార్ దవాఖానాకు’అని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ స్పెషాలిటీ వైద్య సేవలను విస్తరిస్తున్నామని, త్వరలోనే ఇంటింటికీ కంటి, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి అందరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం వల్లే ఇదంతా సాధ్యమైందని అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) ఆవరణలో డయాగ్నోస్టిక్ సెంటర్ సెంట్రల్ హబ్‌ను కేటీఆర్, వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు.
అద్భుతమైన పథకాలు తెచ్చాం..
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే పరిస్థితి ఉండేది. అప్పటి పరిస్థితులకు అద్దం పడుతూ కవులు ఆ విధంగా పాటలు రాశారు. ప్రజలూ ఆదరించారు. నేటి పరిస్థితులు వేరు. తెలంగాణ ఆవిర్భావం తర్వా త వైద్య రంగం అద్భుత ప్రగతి సాధించింది. మంత్రి లక్ష్మారెడ్డి కృషితో సత్ఫలితాలు వచ్చాయి. అందుకే సర్కారు దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెరిగింది.
20 ఐసీయూలు, 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. కేసీఆర్ కిట్ వంటి అద్భుతమైన పథకాలను అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్‌లో 17 బస్తీ దవాఖానాలు ప్రారంభించాం. త్వరలో ఈ సంఖ్యను 45కి పెంచుతాం. హైదరాబాద్‌లో 1,000 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. ప్రస్తుత డయాగ్నోస్టిక్ సేవలను బస్తీ దవాఖానాలకు అన్వయించాలి.
సామాన్యులకు, పేదలకు రోగ నిర్ధారణ పరీక్షలు భారం కాకుండా వైద్య పరీక్షలు ఉచితంగా ప్రభుత్వమే అందించే చర్య లు అద్భుతమైన ఆలోచన. ఒక గంటలో 200 నుంచి వెయ్యి వరకు పరీక్షల రిపోర్టులు అందించే అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న టాటా ట్రస్ట్‌కు అభినందన లు. గత ప్రభుత్వాలు ఏనాడూ ఇలా ఆలోచించలేదు. వైద్యంలోనే ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తోంది. మరణానంతరం వాహనాలతో సామాన్యుల పార్థివదేహాలను వారి ఇళ్లకు చేరుస్తోంది. వైద్యశాఖలో సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు.
అత్యాధునిక సాంకేతికత..
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. హైదరాబాద్ మహానగర పరిధిలోని జిల్లా ఆస్పత్రి, ఐదు ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 120 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్లు, బస్తీ దవాఖానాల నుండి రోగ నిర్ధారణ పరీక్షల శాంపిల్స్ సేకరిస్తారు. సెంట్రల్ హబ్ 24 గంటలూ పని చేస్తుంది.
మరో ఎనిమిది సామాజిక ఆరోగ్య కేంద్రాలు మినీ హబ్‌లుగా పనిచేస్తాయి. అల్ట్రా సౌండ్, ఎక్స్‌రే, ఈసీజీ సేవలు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ నిర్వహణకు కావాల్సిన సాంకేతిక సహాయాన్ని టాటా ట్రస్ట్ అందిస్తోంది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన శాంపిల్స్‌ని సెంట్రల్ హబ్‌కి చేర్చడానికి ఎనిమిది వాహనాలు ఏర్పాటు చేశారు.
శాంపిల్స్ సేకరణ నుంచి సెంట్రల్ హబ్ చేరే వరకు సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన సాంకేతిక నైపుణ్యం కోసం సిబ్బందికి పూర్తి శిక్షణ ఇచ్చారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్‌లో గంట సమయంలో 200 నుంచి 1,000 వరకు పరీక్షలు నిర్వహించడానికి వీలుగా అధునాతన సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేశారు.
నమ్మకం పెంచుతున్నాం..
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంచుతున్నామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందించడమే లక్ష్యంగా డయాగ్నోస్టిక్స్ సేవలను అందుబాటులో కి తెచ్చామన్నారు. హైదరాబాద్‌లోని ప్రతి ఒక్కరు పరీక్ష కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా దవాఖానాల్లో ఎక్కడికక్కడ అన్ని రకాల స్పెషాలిటీ చికిత్సలు అందిస్తున్నామని, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కార్యక్రమం గర్వించాల్సిన అంశమని చెప్పారు.
అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే అనేక రకాల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని చెప్పారు. పెయిన్ కిల్లర్స్‌ను ఇష్టం వచ్చినట్టు వాడటం వల్ల కిడ్నీలు దెబ్బ తింటున్నాయని, మందుల వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ శివప్రసాద్, ఐపీఎం డైరెక్టర్ శంకర్, ఎంఎన్‌జే ఆస్పత్రి డైరెక్టర్ జయలత పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment