కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యసేవలు
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆస్పత్రులకు కావలసిన వసతులు కల్పించామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4 వేల డాక్టర్, సిబ్బంది పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్‌ను లక్ష్మారెడ్డి ప్రారంభిం చారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగి మం దులు, పరీక్షలకు బయటకు వెళ్లకుండా అన్నీ ఆస్పత్రుల్లోనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
రాష్ట్ర బడ్జెట్ తయారీకి ముందుగానే సీఎం కేసీఆర్ ఆస్పత్రులను బలోపేతం చేయడానికి కావలసిన నిధుల గురించి అడిగి తెలుసుకుని వైద్య వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్లు 20 మంజూరు చేశామని, మరో 20 సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జాతీయ రహదారులు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే రహదారుల వెంట ఉన్న పట్టణాల్లోని ఆస్పత్రుల్లో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.