♦ రూ.5 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఎన్రాఫ్-నోనియస్ కంపెనీ సుముఖం
♦ సీఎం కేసీఆర్‌తో కంపెనీ భారతీయ ప్రతినిధుల భేటీ
♦ శ్రీలంకలో కంపెనీ నిర్మించిన ఆసుపత్రులను పరిశీలించనున్న మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రూ.5 వేల కోట్లతో ఆసుపత్రులను నిర్మించేందుకు నెదర్లాండ్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మొత్తాన్ని రుణంగా అందజేయనుంది. ఈ మేరకు ఆ దేశ ఎన్రాఫ్-నోనియస్ కంపెనీకి చెందిన భార తదేశ అధిపతి సునీల్ అగర్వాల్, లైసన్ డెరైక్టర్ హిలాల్ రాదర్, నిర్మాణ డెరైక్టర్ సురేష్‌గుప్తా తదితరులు మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్తగా నిర్మించనున్న ఆసుపత్రుల డిజైన్, నిర్మాణం, నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను వారు ముఖ్యమంత్రికి అందజేశారు. ఆసుపత్రుల నిర్మాణానికి నెదర్లాండ్ కంపెనీ ముందుకు రావడం పట్ల సీఎం సుముఖత వ్యక్తం చేశారు.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో 5 వేలకుపైగా పడకలతో ఆసుపత్రులను నిర్మించనున్నట్లు కంపెనీ ప్రతినిధులకు కేసీఆర్ వివరించారు. కాలవ్యవధిని, రుణానికి సంబంధించిన నియమ నిబంధనలు తెలియజేయాలని సూచించారు. తాము ఇప్పటికే శ్రీలంక, దుబాయ్‌ల్లో ఇలాంటివి నిర్మించామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ వారంలో శ్రీలంకలో పర్యటించి ఎన్రాఫ్-నోనియస్ నిర్మించిన ఆసుపత్రులను, వసతులను అధ్యయనం చేసి రావాల్సిందిగా మంత్రి లక్ష్మారెడ్డిని, ఆ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, డయాగ్నస్టిక్ విభాగాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఆ కంపెనీ నిర్మించిందని సీఎం కార్యాలయం పేర్కొంది. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, అధికారులు రాజేశ్వర్ తివారీ, నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, నవీన్‌మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రుల నిర్మాణానికి ముందుకొచ్చిన నెదర్లాండ్స్ కంపెనీ
Published Wed, Feb 24 2016 2:53 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement