ప్రైవేటు మెడికల్ ఫీజుల పెంపు | Private medical fees hike | Sakshi
Sakshi News home page

ప్రైవేటు మెడికల్ ఫీజుల పెంపు

Published Sun, Aug 21 2016 2:33 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

ప్రైవేటు మెడికల్ ఫీజుల పెంపు - Sakshi

ప్రైవేటు మెడికల్ ఫీజుల పెంపు

- కాలేజీ యాజమాన్యాలతో మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు
- ఎన్నారై కోటా ఫీజు రూ.55 లక్షల వరకు పెరిగే అవకాశం
- బీ కేటగిరీ ఫీజు రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలకు..
- ప్రైవేటు కాలేజీల ప్రతిపాదనలను సీఎంకు విన్నవించనున్న మంత్రి
 
 సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ, ఎన్నారై కోటా ఎంబీబీఎస్ ఫీజులను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే తెలంగాణలోనూ ఫీజులను పెంచాలని యాజమాన్యాలు కోరగా... మంత్రి అందుకు అంగీకరించారు. అయితే ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు నివేదించాక దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. త్వరలో ప్రైవేటు మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నందున ఆ లోపే ఫీజులను ఖరారు చేసి జీవో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

ఫీజులు పెంచాలని ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు గతనెల అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ)కి విన్నవించాయి. అందులో భాగంగా మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. గతేడాదే ఫీజులు పెంచిన ప్రభుత్వం.. ప్రైవేటు మెడికల్ కాలేజీల ఒత్తిడికి తలొగ్గి ఈ ఏడాది కూడా ఫీజులు పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం రెండేళ్లకోసారి ఫీజులను సవరించాలి. కానీ ఏడాదికే పెంచడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘నీట్’ ద్వారా భర్తీ చేస్తే పూర్తిగా ర్యాంకుల ఆధారంగానే సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని... ఇది తమకు నష్టమని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి. అందుకే పెంచుతున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

 ఏ కేటగిరీలో ఎంతెంత..?
 రాష్ట్రంలో మొత్తం 21 మెడికల్ కాలేజీలుండగా.. వాటిలో మొత్తం 3,450 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,050 సీట్లున్నాయి. 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,100 సీట్లున్నాయి. అవిగాక రెండు మైనారిటీ కాలేజీల్లో 300 సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. వాటికి ప్రభుత్వం నిర్దేశించిన రూ.10 వేల ఫీజు వసూలు చేస్తారు. 13 నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లోని మొత్తం 2,100 ఎంబీబీఎస్ సీట్లలో 50 శాతం (1,050) సీట్లను ఎంసెట్ ద్వారా ర్యాంకు తెచ్చుకున్న వారికి ప్రభుత్వ ఫీజు ప్రకారం కేటాయిస్తారు. వారికి కన్వీనర్ కోటా కింద రూ.60 వేల ఫీజు వసూలు చేస్తారు. 35 శాతం (735) బీ కేటగిరీ సీట్లకు, మరో 15 శాతం (315) ఎన్నారై కోటా సీట్లకు మాత్రం ఏపీలో మాదిరిగా ఫీజులు పెంచుతారు.

ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రస్తుతం బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీటుకు ఏడాదికి రూ.9 లక్షలు వసూలు చేస్తుండగా.. దాన్ని ఏపీ తరహాలో రూ.11 లక్షలకు పెంచనున్నారు. అలాగే సీ కేటగిరీ (ఎన్నారై) సీట్ల ఫీజు ప్రస్తుతం రూ.11 లక్షలుంది. ఏపీలో ఈ కేటగిరీ ఫీజును ఐదు రెట్ల వరకు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ ప్రకారమే తెలంగాణలో పెంచితే ఎన్నారై కోటా ఎంబీబీఎస్ సీటు ఫీజు ఏడాదికి రూ.55 లక్షలు కానుంది. ఇక మైనారిటీకి చెందిన రెండు కాలేజీల్లో 300 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిలో కన్వీనర్ కోటా సీట్లు 60 శాతం, బీ కేటగిరీ సీట్లు 25 శాతం, ఎన్నారై కోటా సీట్లు 15 శాతం ఉన్నాయి. మైనారిటీ కాలేజీల్లో ప్రస్తుతం బీ కేటగిరీ ఫీజు రూ.11 లక్షలుంది. దాన్ని రూ.15 లక్షలకు పెంచాలని యాజమాన్యాలు కోరాయి. ఎన్నారై కోటా ఫీజు ప్రస్తుతం రూ.13 లక్షలుండగా..  రూ. 30 లక్షలకు పెంచాలని కోరారు. ఆ ప్రకారమే ఫీజులు పెరగనున్నాయి. అలాగే రాష్ట్రంలో ప్రైవేటు డెంటల్ కాలేజీలు 11 ఉండగా.. వాటిలో 1,040 సీట్లున్నాయి. అందులో బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లను కూడా ఏపీ మాదిరిగానే భర్తీ చేసే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement