108 ఉద్యోగుల వేతనాల పెంపు
♦ సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆరోగ్య మంత్రికి సీఎం ఆదేశం
♦ త్వరలోనే ఉద్యోగులు, అధికారులతో చర్చలు
సాక్షి, హైదరాబాద్: ‘108’ ఉద్యోగుల వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని... ఉద్యోగులు, అధికారులతో మాట్లాడి వేతనాల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు అందించే 108 అంబులెన్స్‌లను, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించే 104 వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందేలా పోలీస్, వైద్యశాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వైద్య శాఖపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు.
ఇటీవల సీఎంతో ముఖాముఖిలో వరంగల్ జిల్లాకు చెందిన 108 ఉద్యోగి రమేశ్ ప్రస్తావించిన అంశాలపై చర్చించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 108 అంబులెన్స్ సేవల మెరుగుదలకు, విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి లక్ష జనాభాకు ఒక 108 చొప్పున 312 వాహనాలుండేవన్నారు. తాము 75 వేల జనాభాకు ఒకటి చొప్పున 108 ఉండాలని నిర్ణయించామని, ఫలితంగా 169 అంబులెన్స్‌లు పెరిగాయని చెప్పారు.
వీటిలో 145 వాహనాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని, మిగతావి కొద్ది రోజుల్లోనే సేవలందిస్తాయని సీఎం పేర్కొన్నారు. ఇక ప్రధాన రహదారుల వెంట ప్రమాదాలతో అపార ప్రాణనష్టం జరుగుతోందని... దీన్ని నివారించడానికి పోలీసులు, వైద్య శాఖ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రధాన రహదారుల వెంట ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలని, కావాల్సిన వైద్య పరికరాలన్నీ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రహదారుల వెంట పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లుఉండాలని, ట్రామా సెంటర్లు ఆన్‌లైన్ హెల్త్‌కేర్ సేవలను ఉపయోగించుకునే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
గ్రామీణ డాక్టర్లకు నగదు ప్రోత్సాహకం
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి, అక్కడ పనిచేస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహకం అందించే ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు సమీప పట్టణంలో ఉండే వెసులుబాటు కల్పించాలని, అదే సమయంలో డాక్టర్లు కచ్చితంగా సమయ పాలన పాటించి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు.
నాలుగు పెద్దాసుపత్రులకు స్థలాన్వేషణ
హైదరాబాద్‌లో 4 పెద్దాసుపత్రులు నిర్మించాలని నిర్ణయించినందున వెంటనే స్థలాల గుర్తింపు జరగాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా, ఇప్పటికే గుర్తించిన కొన్ని స్థలాల వివరాలను సీఎంకు మంత్రి లక్ష్మారెడ్డి అందజేశారు. వీటిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మరోసారి చర్చించి అనువైన స్థలాల్లో నిర్మాణాలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించామని వాటి ఫలితం పేదలకు అందేలా పనిచేయాలని సూచించారు.