ర్యాలీలో పాల్గొన్న మంత్రులు నాయిని, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్
సాక్షి, హైదరాబాద్: అంధత్వ నివారణ అందరి బాధ్యతని వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాలలో భాగంగా ఆదివారం నుంచి 17వ తేదీ వరకు అంధత్వ నివారణ సంస్థ, సరోజినీ కంటి ఆస్పత్రి సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవేర్‌నెస్ వాక్‌ను ఆయన ప్రారంభించారు. 40 ఏళ్లు దాటిన వారిలో వారసత్వంగా సంక్రమించే ఈ గ్లకోమా వ్యాధిని సాధ్యమైనంత తొందరగా గుర్తించగలిగితే వైద్య చికిత్స అందించవచ్చన్నారు.
కనుగుడ్డు చుట్టూ రంగుల వలయాలు ఏర్పడటం, నొప్పి ఉండటం, చూపు మందగించడం, కాంతి లేకపోవడం దీని లక్షణాలని చెప్పారు. ఇండియాలో 1.2 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారని సర్వేలు చెబుతున్నాయన్నారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రే ఏడాదికి 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నదన్నారు. అందులో సగటున 600 మందికి శస్త్ర చికిత్సలు చేస్తున్నారని చెప్పారు. సీఎం చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఉచితంగా గ్లకోమా స్క్రీనింగ్ పరీక్షలు
వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి, చికిత్స చేయించుకుంటే గ్లకోమా వ్యాధి నుంచి తప్పించుకోవచ్చని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా సరోజినీ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో వారం పాటు గ్లకోమా స్క్రీనింగ్ కార్యక్రమాలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌గౌడ్ తెలిపారు. ప్రజా చైతన్యం కలిగించే ర్యాలీలు, సెమినార్లు, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, రోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, డీఎంఈ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment