ఆరోగ్య వర్సిటీలో 80 పోస్టులు
భర్తీకి త్వరలో నోటిఫికేషన్.. సీఎం ఆమోదానికి వెళ్లిన ఫైలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 80 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే రిజిస్ట్రార్, వైస్‌చాన్స్‌లర్లను నియమించిన ప్రభుత్వం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జరిగేలా పరిపాలనా సిబ్బందిని భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పోస్టులకు అంగీకారం తెలిపారు. అయితే సంబంధిత ఫైలుపై సంతకం కోసం వైద్య ఆరోగ్యశాఖ సీఎం వద్దకు పంపినట్లు ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తామని మంత్రి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో కాళోజీ వర్సిటీ పనిచేయాల్సి ఉన్నందున భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరలో చేపట్టాలని నిర్ణయించారు. పోస్టుల భర్తీ విశ్వవిద్యాలయానికే అప్పగిస్తారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, జాయింట్ రిజిస్ట్రార్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు తదితర పోస్టులను భర్తీ చేస్తారు.
కార్యనిర్వాహక మండలి నియామకం
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి(ఈసీ)కి సభ్యులను నామినేట్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు ప్రొఫెసర్ కె.శ్రీనాథ్‌రెడ్డి, నిమ్స్ మాజీ డెరైక్టర్ ప్రొఫెసర్ డి.రాజారెడ్డి, తెలంగాణ వైద్య విద్య మాజీ సంచాలకుడు పుట్టా శ్రీనివాస్, అన స్థీషియా ప్రొఫెసర్ మంతా శ్రీనివాస్, నిజామాబాద్ మెడికల్ కాలేజీ ఫార్మకాలజీ ప్రొఫెసర్ కె.ఇందిర, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆప్తమాలజీ ప్రొఫెసర్ జె.పాండురంగ, కరీంనగర్ పిమ్స్ రేడియాలజీ ప్రొఫెసర్ బి.రమేశ్‌లను నామినేట్ చేశారు. వీరు మూడేళ్లపాటు ఈసీ సభ్యులుగా కొనసాగుతారు.