సాక్షి, అమరావతి: ‘‘గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను చక్కగా వినియోగించుకొని, ప్రభుత్వ వైద్య వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు కీలక సేవలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించారు. ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చారు. నిధులను ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులు పూర్తిగా బలహీనపడ్డాయి. వైద్య వ్యవస్థ దిగజారిపోయింది.’’ అని నిపుణుల కమిటీ కుండబద్దలు కొట్టింది. ప్రభుత్వ వైద్య వ్యవస్థకు కాయకల్ప చికిత్స తప్పనిసరి అని తేల్చిచెప్పింది. ఆరోగ్య శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలను సిఫార్సు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలలపాటు పర్యటించారు. పలువురి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సామాన్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో కొనసాగుతున్న ప్రాజెక్టులను పరిశీలించారు. తుది నివేదికను సిద్ధం చేశారు. నిపుణుల కమిటీ ఈ నెల 19వ తేదీన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తమ నివేదికను అందజేయనుంది.
నిపుణుల కమిటీ సిఫార్సులు
- రోగులకు ఎలక్ట్రానిక్ హెల్త్‌కార్డులు ఇవ్వాలి. దీనివల్ల ప్రత్యేక ట్రాకింగ్ విధానం అమలు చేయొచ్చు.
- ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన హెల్త్ ప్రాక్టీషనర్స్ మాత్రమే మందులు ఇచ్చే విధానం ఏర్పాటు చేయాలి.
- విలేజ్ హెల్త్ క్లినిక్‌లు నెలకొల్పాలి.
- ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థను బలోపేతం చేయాలి.
- ప్రతి పీహెచ్‌సీలో ల్యాబొరేటరీ, ఫోన్, కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాటికల్ అసిస్టెంట్ ఉండాలి.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేసుకోవాలి.
- అందులో వచ్చే సొమ్ములో 30% డబ్బును అద్దెకింద ప్రభుత్వ ఆస్పత్రికి చెల్లించాలి.
- ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేసే వైద్యులు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి ఆరోగ్యశ్రీ పరిధిలోని సర్జరీలు చేయకూడదు.
- అనుమతి లేకుండా ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తే తమను విధుల తొలగించవచ్చని వైద్యుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలి.
- అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ, క్యాజువాలిటీ ఉండాలి
- ‘108’ అంబులెన్సులను 3 షిఫ్టుల్లో నిర్వహించాలి.
- రోగుల వివరాలు, బయోమెట్రిక్ అటెండెన్స్, లైవ్ డ్యాష్‌బోర్డ్‌లను ఏర్పాటు చేయాలి.
- పీపీపీ ప్రాజెక్టులను పునఃసమీక్షించాలి.
నిపుణుల కమిటీ నివేదికలోని ముఖ్యమైన అంశాలు..
- రాష్ట్రంలో గుండెపోటు, డయాబెటిక్, హైపర్ టెన్షన్ కేసులతో పాటు బలవన్మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. ఐరన్ లోపం, రక్తహీనత వంటి జబ్బులు వేధిస్తున్నాయి.
- అర్హత లేని వైద్యులు రోగుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారు. అవసరం లేకపోయినా యాంటీబయోటిక్స్ వాడుతున్నారు.
- మందుల సరఫరా అత్యంత లోపభూయిష్టంగా ఉంది. మందుల కొరత వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- గత మూడేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా సేవలను ప్రైవేట్‌పరం చేశారు.
- వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో వైద్యుల కొరత వేధిస్తోంది.
- ప్రభుత్వ హాస్పిటళ్లలో మౌలిక వసతులు కొరవడ్డాయి. ఆపరేషన్ థియేటర్ల పరిస్థితి దారుణంగా మారింది.
- అన్ని వసతులున్న ఆస్పత్రులను రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కోల్పోవాల్సి వచ్చింది.
- ఏపీలో చాలా వైద్య కళాశాలల్లో ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, రేడియోథెరఫీ వంటి విభాగాలు లేవు. ఉన్నా సక్రమంగా పని చేయడం లేదు.
- ఒక్కసారి ఇన్‌పేషెంట్‌గా చేరితే గ్రామీణ ప్రాంతాల్లో రూ.13,010, పట్టణ ప్రాంతాల్లో రూ.30,712 ఖర్చు చేయాల్సి వస్తోంది.
- రాష్ట్ర ప్రజలు మందుల కోసం ప్రతిఏటా రూ.21,309 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
- సాంక్రమిక(కమ్యూనికబుల్) వ్యాధుల నియంత్రణలో రాష్ట్రం విఫలమైంది. ఖాళీలను భర్తీ చేయకపోవడం, సాంకేతిక సిబ్బంది లేకపోవడం వంటివి దారుణంగా దెబ్బతీశాయి.
- నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (అసాంక్రమిక వ్యాధులు) నియంత్రణలో విఫలమయ్యారు.
- క్యాన్సర్, గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ జబ్బులు పెరుగుతున్నా వాటి నియంత్రణకు చర్యలు తీసుకోలేదు.
- 50 శాతం అంబులెన్సులు సరైన కండిషన్‌లో లేవు.
Comments
Please login to add a commentAdd a comment