4 కొత్త మెడికల్ కాలేజీలు!
* ఉభయ గోదావరి జిల్లాలకు చెరొకటి
* ప్రొద్దుటూరు, విజయనగరాల్లో ఒక్కొక్కటి ప్రతిపాదన
* వైద్య కళాశాలలుగా జిల్లా ఆస్పత్రుల ఉన్నతీకరణ
* నిధులిచ్చేందుకు కేంద్రం సంసిద్ధత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో నాలుగు వైద్య కళాశాలల ఏర్పాటుకు వైద్య విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11 వైద్య కళాశాలలుండగా జిల్లా ఆస్పత్రులను ఉన్నతీకరించి అదనంగా నాలుగు మెడికల్ కళాశాలలకు అనుమతి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. జిల్లా ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేసి మెడికల్ కళాశాలలుగా మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అంగీకరించింది.
ఈ కాలేజీలకు కేంద్ర ప్రాయోజిత పథకం కింద నిధులు ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఒక్కో కళాశాలకు 100 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు కూడా ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపింది. ఈ నేపథ్యంలో వైద్యవిద్యా శాఖాధికారులు నాలుగు కాలేజీల ప్రతిపాదనల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసినట్లు సమాచారం. ఒక్కో కళాశాలకు రూ.189 కోట్లు చొప్పున యవ్యయం అవుతుందని అంచనా. ఇందులో 75 శాతం కేంద్రం, 25 శాతం నిధులు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.
కొత్త కళాశాలలు ఇక్కడే
ఏలూరు జిల్లా ఆస్పత్రి(పశ్చిమగోదావరి), జిల్లా ఆస్పత్రి (విజయనగరం), ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి (వైఎస్సార్), రాజమండ్రి జిల్లా ఆస్పత్రి (తూర్పుగోదావరి)లను వైద్య కళాశాలలుగా ఉన్నతీకరించాలని ప్రతిపాదించారు. మరోవైపు నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల, తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలను కూడా కేంద్ర ప్రాయోజిత పథకం కింద చేర్చుకుని నిధులివ్వాలని అధికారులు కోరారు. జిల్లా ఆస్పత్రులను వైద్య కళాశాలలుగా అనుమతించాలంటే కనీసం 500 పడకల ఆస్పత్రిగా ఉండాలి. 4 లక్షల చదరపు అడుగు విస్తీర్ణంలో ఆస్పత్రి భవనాలు ఉండాలని భారతీయ వైద్యమండలి నిబంధన విధించింది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రుల్లో 350 పడకలు లోపే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో 150 పడకలు అదనంగా ఏర్పాటు చేసుకోవాలి.