సాక్షి, అమరావతి: ‘నీట్’ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం పోటీపడిన రాష్ట్రంలోని వేలాది మంది అభ్యర్థులు అడ్మిషన్ ఎక్కడ వస్తుందనే అంచనాల్లో తలమునకలై ఉన్నారు. తొలిసారిగా ఏపీ జాతీయ పూల్‌లోకి వెళ్లడంతో దేశవ్యాప్తంగా ఏ కళాశాల ఎలాంటిదో తెలియక.. వచ్చిన ర్యాంకుతో ఏ కళాశాలలో సీటు వస్తుందో అర్ధంకాక సతమతమవుతున్నారు. గత ఏడాది రాష్ట్ర సీట్లు జాతీయ పూల్‌లో లేవు. ఈ ఏడాది కొత్తగా చేరడంతో రాష్ట్రంలోని 280 సీట్లకు పైగా జాతీయ కోటాలోకి వెళ్లాయి. అలాగే, అన్ని రాష్ట్రాలకు చెందిన 4,400 జాతీయ పూల్ సీట్లకు అన్ని రాష్ట్రాలూ పోటీపడవచ్చు. తాజాగా గత సోమవారం ‘నీట్’ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో.. తమ ర్యాంకుకు ప్రభుత్వ సీటు లేదా కన్వీనర్ కోటా సీటు వస్తుందో రాదోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. కాగా, అనేకమంది అభ్యర్థులకు 460 నుంచి 480 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మార్కులతో కన్వీనర్ కోటా సీటు వస్తుందో లేదోనన్న టెన్షన్‌లో అభ్యర్ధులు ఉన్నారు. 500 మార్కులు దాటిన అభ్యర్థులు మాత్రం సీటు వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సీట్ల కోతతో మరింత అసంతృప్తి
మన రాష్ట్రంలో ఈ ఏడాది 49వేల మంది పైచిలుకు అభ్యర్థులు ‘నీట్’ పరీక్ష రాశారు. అయితే, ఈ ఏడాది నాలుగు ప్రైవేటు కళాశాలలకు సంబంధించిన మొత్తం సీట్లకు భారతీయ వైద్యమండలి అనుమతి నిరాకరించింది. దీనివల్ల కన్వీనర్ కోటా సీట్లు కోల్పోయినట్లయింది. సీట్లు తగ్గడంతో మెరుగైన మార్కులు సాధించినా ఫలితం ఉండదని అభ్యర్థులు వాపోతున్నారు. దీంతో అభ్యర్థులు కేటగిరీల వారీగా గత ఏడాది కటాఫ్ మార్కులు, ఏ ర్యాంకు వరకూ సీటు వచ్చింది.. వంటి వివరాలను ఆరా తీస్తున్నారు.
నీట్ అభ్యర్థుల్లో ఆందోళన
దేశవ్యాప్తంగా సుమారు 82 వైద్య కళాశాలల్లో 11వేల పైచిలుకు సీట్లకు అనుమతి ఇవ్వకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఈ విషయమై ఆయా ప్రైవేటు వైద్య కళాశాలలు ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఎంసీఐ నిర్ణయాన్ని రాజస్థాన్ హైకోర్టు ఇప్పటికే తప్పుబట్టింది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇలా కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు కళాశాలల మంజూరును సరళతరం చేస్తామంటూనే మరోవైపు సీట్లను తొలగించడం వెనుక ఏదో ఉందని ప్రైవేటు వైద్య కళాశాలలు తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నాయి. ఇది పూర్తిగా ఎంసీఐ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా పలు వైద్యకళాశాలలు అభివర్ణించాయి.
Comments
Please login to add a commentAdd a comment