ప్రతి సీటూ ప్రతిభకే
మెడికల్ కాలేజీల్లో ఇక యాజమాన్య కోటా కౌన్సెలింగ్ బంద్!
- ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ సీట్లకు ఒకే కౌన్సెలింగ్
- సర్కారుకు ప్రతిపాదించిన వైద్య ఆరోగ్యశాఖ
- నిర్ణయం అమల్లోకి వస్తే సీట్ల అమ్మకాలకు, డొనేషన్లకు చెక్
- ఆయుష్ సీట్ల భర్తీకి కూడా ‘నీట్’!
సాక్షి, హైదరాబాద్
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు సర్కారుకు ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఫీజులతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న వారికే సీట్లు లభిస్తాయి. సీట్ల కొనుగోళ్లు, అమ్మకాలకు చెక్ పడుతుంది. అంతేకాదు ప్రభుత్వం నిర్ధారించిన ప్రైవేటు ఫీజు తప్ప ఇష్టారాజ్యంగా డొనేషన్లు వసూలు చేయడానికీ అవకాశం ఉండదు. అయితే వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
ఒకే ర్యాంకు... ఒకే కౌన్సెలింగ్..
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. గతేడాది ‘నీట్’ ర్యాంకుల ఆధారంగానే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లకు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వమే కౌన్సెలింగ్ నిర్వహించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లకు మాత్రం యాజమాన్యాలే మరో కౌన్సెలింగ్ నిర్వహించుకున్నాయి. ఎన్నారై కోటా సీట్లను ఇష్టారాజ్యంగా అమ్మేసుకున్నాయి. దీంతో నీట్ ర్యాంకులను ఆధారం చేసుకున్నా అనేకమంది డొనేషన్లు చెల్లించే బీ కేటగిరీ సీట్లల్లో చేరాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ‘నీట్’స్ఫూర్తికి విరుద్ధమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే ర్యాంకు... ఒకే కౌన్సెలింగ్ అనేది ‘నీట్’ఉద్దేశమని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని కోరుతున్నాయి.
బీ కేటగిరీలో 915 ఎంబీబీఎస్ సీట్లు
రాష్ట్రంలో 25 మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒకటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీ ఉన్నాయి. 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలు, మరో 3 మైనారిటీ మెడికల్ కాలేజీలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 1,050 ఎంబీబీఎస్ సీట్లుండగా.. మైనారిటీ సహా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,700 సీట్లున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 50 శాతం, మైనారిటీ కాలేజీల్లోని 60 శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేయనుంది. ప్రైవేటులోని 35 శాతం, మైనారిటీలోని 25 శాతం సీట్లు బీ కేటగిరీ సీట్లు... కాగా మిగిలినవి ఎన్నారై కోటా సీట్లున్నాయి. దాదాపు 915 బీ కేటగిరీ సీట్లకు కూడా ఏకీకృత కౌన్సెలింగ్ నిర్వహిస్తే.. ఇవి కూడా ప్రతిభ ఉన్న వారికే లభిస్తాయని అంటున్నారు. ఇక ఎన్నారై కోటా సీట్లు ఎలా భర్తీ చేస్తారనేది తేల్చాల్సి ఉంది.
ఆయుష్ సీట్లూ ‘నీట్’తోనే?
ఆయుష్ సీట్లను కూడా ‘నీట్’ర్యాంకుల ద్వారానే భర్తీ చేయాలంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సీబీఎస్‌ఈకి లేఖ రాసినట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నీట్ నోటిఫికేషన్‌లో కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు అని మాత్రమే ఉందన్నారు. ఇప్పుడు ఆయుష్‌నూ చేర్చాలని కేంద్రం కోరుతోందని ఆయన వివరించారు. దీనిపై సీబీఎస్‌ఈ నాలుగైదు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ ఆయుష్ సీట్లనూ నీట్ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయిస్తే ఇక అన్ని మెడికల్, డెంటల్, ఆయుష్ కోర్సులకే ఒకే ప్రవేశ పరీక్ష, ఒకే కౌన్సెలింగ్ ఉంటుంది.