మరో పది ప్రైవేటు వైద్యకళాశాలలు!
ఎంసీఐ పరిశీలనలో దరఖాస్తులు
ఎసెన్షియాలిటీ ఇచ్చిన రాష్ట్రప్రభుత్వం
అనుమతిస్తే అదనంగా 1,450 మెడిసిన్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో పది కొత్త వైద్య కళాశాలలకు అనుమతి వచ్చే అవకాశం ఉంది. కొంతకాలంగా రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు పలు దరఖాస్తులు వచ్చాయి. వాటిలో పది వైద్య కళాశాలల దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు మంజూరు చేసింది. ఆ మేరకు పది దరఖాస్తులు ప్రస్తుతం భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) పరిశీలనలో ఉన్నాయి. వీటికి 2014-15 విద్యా సంవత్సరానికి అనుమతి వచ్చే అవకాశమున్నట్టు ఎంసీఐ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఎంసీఐ పరిశీలనలో ఉన్న ఒక కళాశాల దరఖాస్తుల్లో ఒకటి వంద సీట్లకు, మిగతా తొమ్మిది కళాశాలలు తమకు 150 వంతున ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నాయి. వీటికి అనుమతి వస్తే రాష్ట్రంలో కొత్తగా 1450 ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. ఇవి కాకుండా మెడికల్ కాలేజీల కోసం వచ్చిన మరో 30 దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.
వచ్చే ఏడాది నెల్లూరులో: వచ్చే ఏడాది నెల్లూరులో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి కనీసం 100 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. గత ఏడాదే ఇది అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెప్పింది. కానీ నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 5950 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పరిధిలో 2300 కాగా, ప్రైవేటు కళాశాలల్లో 3650 సీట్లు ఉన్నాయి. వచ్చే ఏడాది నెల్లూరు 100 సీట్లు అందుబాటులోకి వస్తే ప్రభుత్వ సీట్ల సంఖ్య 2400కు పెరుగుతుంది. తిరుపతిలో పద్మావతి కళాశాల కూడా అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కళాశాల పూర్తయితే మరో 100 ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి.