50 శాతం రద్దు!
► వైద్యులకు షాక్
► వైద్య కౌన్సిల్ నిబంధనలు తప్పనిసరి
► ఆందోళనలో ప్రభుత్వ వైద్యులు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్న వైద్యులకు పీజీలో యాభై శాతం సీట్ల కేటాయింపును రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. వైద్యులకు షాక్ ఇచ్చే రీతిలో తీర్పు వెలువడడమే కాకుండా, భారత వైద్య కౌన్సిల్ నిబంధనల మేరకు సీట్ల కేటాయింపులు సాగాల్సిందేనని శనివారం కోర్టు స్పష్టం చేసింది.
సాక్షి, చెన్నై: గ్రాడ్యుయేషన్‌తో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులుగా సేవల్ని అందిస్తున్న వారికి పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ప్రత్యేక రాయితీ ఇన్నాళ్లు తమిళనాట దక్కుతూ వచ్చింది. తమిళనాడు వైద్య విధానం మేరకు ఉన్నత చదువుల్లో 50 శాతం సీట్లను ఈ వైద్యులకు కేటాయిస్తూ వచ్చారు. నీట్ పుణ్యమా ఇటీవల భారత వైద్య కౌన్సిల్ రూపొందించిన నిబంధనలు తమిళనాడు పాలసీ మీద తీవ్ర ప్రభావం పడేలా చేసింది. నీట్‌కు వ్యతిరేకంగా ఓ వైపు పోరాటం సాగుతున్న సమయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు వైద్యుల్ని ఆందోళనలో పడేసింది.
యాభై శాతం సీట్లను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వైద్యులు ఆందోళన బాట పట్టారు. రెండు వారాలకు పైగా ఆందోళనలు సాగడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అప్పీలుకు వెళ్లింది. ప్రభుత్వం, వైద్య సంఘాల తరఫున దాఖలు చేసుకున్న అప్పీలు పిటిషన్‌ను న్యాయమూర్తులు శశిధరన్, సుబ్రమణియన్‌లతోకూడిన బెంచ్ విచారించింది. ఈ బెంచ్ తీర్పుభిన్న వాదనలకు దారి తీయడంతో మూడో న్యాయమూర్తి బెంచ్‌కు విచారణ చేరింది. న్యాయమూర్తి సత్యనారాయన్ నేతృత్వంలో, న్యాయమూర్తులు శశిధరన్, సుబ్రమణియన్‌లతో కూడిన బెంచ్ రెండు రోజులుగా పిటిషన్‌ను విచారించి శనివారం తీర్పును వెలువరించింది.
50 శాతం రద్దు : ఇది వరకు ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తి శశిధరన్ తమిళనాడు పాలసీకి అనుగుణంగా, న్యాయమూర్తి సుబ్రమణియన్ భారత వైద్య కౌన్సిల్ నిబంధనల్ని పాటించాల్సిన ఇచ్చిన తీర్పులను, తన నేతృత్వంలోని సాగిన విచారణను పరిగణించి న్యాయమూర్తి సత్యనారాయణన్ సాయంత్రం నాలుగున్నర గంటలకు తీర్పు ఇచ్చారు. తమకు అనుకూలంగా తీర్పు ఉంటుందన్న భావనతో వైద్యులు ఆందోళనను సైతం వీడి రోగులకు వైద్య సేవల్ని అందించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, తీర్పు వైద్యులకు పెద్ద షాక్‌గా మారింది.
న్యాయమూర్తి సుబ్రమణియన్ తీర్పును గుర్తుచేస్తూ న్యాయమూర్తి సత్యనారాయణన్ 120 పేజీలతో కూడిన తీర్పును వెలువరించారు. 50 శాతం కేటాయింపును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తమిళనాడు పాలసీతో పని లేదని, నీట్ రూపంలో భారత వైద్య కౌన్సిల్ తీసుకొచ్చిన నిబంధనల్ని అనుసరించాల్సిన అవసరం ఉందని బెంచ్ స్పష్టం చేసింది. అప్పీలు పిటిషన్లను తిరస్కరించింది. కింది బెంచ్ ఇచ్చిన తీర్పు, న్యాయమూర్తి సుబ్రమణియన్ తీర్పును సమర్థిస్తూ 50 శాతం రద్దును ధ్రువీకరిస్తున్నట్టు సత్యనారాయణన్ ప్రకటించడం వైద్యులక పెద్ద షాక్ తగిలేలా చేసింది. తమిళనాడు హక్కులను కాలరాసే విధంగా తీర్పు వెలువడిందంటూ వైద్య సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
భవిష్యత్తుల్లో గ్రామీణ, అటవీ, కుగ్రామాల్లో వైద్య సేవల్ని అందించేందుకు ఏ ఒక్కరూ ముందుకురారు అని , ఇందుకు అద్దం పట్టే రీతిలో తీర్పు వెలువడిందని వైద్యుల సంఘం నాయకుడు కదిర్ వేల్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే విధానం అంటూ, 28 ఏళ్లుగా తమిళనాడులో సాగుతున్న విధానాన్ని తుంగలో తొక్కడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మరో నాయకుడు బాలకృష్ణన్ పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని, ప్రభుత్వ వైద్యులకు అనుగుణంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తుల్లో గ్రామీణ ప్రాంతాల వైపుగా ఏ వైద్యుడూ వెళ్లడని, అలాగే, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థికి వైద్య సీటు అందని ద్రాక్షగా మారడం ఖాయం అని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును సమగ్రంగా పరిశీలించినానంతరం తదుపరి తమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.