ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో సుభిక్ష రిటైల్ స్టోర్స్, విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు ఆర్ సుబ్రమణియన్‌ను ఈడీ ఆరెస్ట్ చేసింది. డిపాజిటర్లను వందల కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఆరోపణలపై బుధవారం ఇతణ్ణి అరెస్ట్ చేసింది. బ్యాంకులకు, ఇతర పెట్టుబడిదారులకు భారీ ఎత్తున రుణాలను ఎగవేసిన ఆరోపణలు, వివిధ న్యాయస్థానాలలో చట్టపరమైన కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈడీ తాజాగా ఈ చర్యకు దిగింది.
సుబ్రమణియన్ 250 కోట్ల రూపాయల మేర డిపాజిటర్లను మోసగించడంతోపాటు, సుమారు రూ. 750 కోట్లకు 13 బ్యాంకులకు టోకరా వేశాడు. ఈ నేపథ్యంలో 2013లోనే ఈయనపై అనేక క్రిమినల్, సివిల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా సుమారు 10 ఎకరాల నాలుగు వ్యవసాయ భూములను, రెండు ఇతర ఖాళీ ప్లాట్లను మోసపూరితంగా తన గ్రూప్ కంపెనీకి మార్చుకున్నాడనీ ఈడీ తేల్చింది. వీటితోపాటు అతని భార్య పేరుతో ఉన్న మరో రెండు ప్లాట్లను కూడా ఈడీ ఇప్పటికే ఎటాచ్ చేసింది.
కాగా 1991లో విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను ప్రారంభించారు. దీని ద్వారా భారీ ఎత్తున డిపాజిట్లు సమీకరించారు. తద్వారా దాదాపు 49 వ్యాపారాలు ప్రారంభించాడు. ఇందులో సుభిక్ష సూపర్ మార్కెట్ చెయిన్ ఒకటి. 1997 లో చెన్నైలో మొట్టమొదటి రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేశాడు. దేశవ్యాప్తంగా స్టోర్ల ఏర్పాటు కోసం మోసపూరిత నిధులను దారి మళ్ళించిన ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 2002లో మనీ లాండరింగ్ చట్టం నిబంధనల ప్రకారం ఈడీ విచారణ చేపట్టింది. ఈ వివాదంతో 2009లో సుభిక్షకు చెందిన 1,600 రిటైల్ షాపులు మూతపడ్డాయి. ఐఐటి, ఐఐఎంలో చదువుకున్న సుబ్రమణియన్ గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే సిటీ బ్యాంకు, ఎన్‌ఫీల్డ్ ఇండియా వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment