యాసిడ్ దాడి
కళాశాల నుంచి బయటకు వస్తున్న విద్యార్థినులపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్‌తో దాడిచేశాడు. ఇద్దరు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలినవారు తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం మదురైలో ఈ ఘటన కలకలాన్ని సృష్టించింది.
సాక్షి, చెన్నై: గతంలో మహిళలపై, యువతులపై యాసిడ్ దాడులు పేట్రేగడంతో హైకోర్టు ఆగ్రహానికి పోలీసుయంత్రాంగం గురికావాల్సి వచ్చిన విషయం తెలిసిందే. మహిళలు, యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్న యాసిడ్‌ను రాష్ట్రంలో నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎక్కడా యాసిడ్ దాడులు చోటుచేసుకోలేదు. అయితే శుక్రవారం మధ్యాహ్నం మదురై జిల్లా తిరుమంగళంలో విద్యార్థినులపై యాసిడ్ దాడి జరగడం కలకలాన్ని రేపింది. యాసిడ్ విక్రయాల కట్టడి లక్ష్యంగా పోలీసు యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్టు ఈ ఘటనతో తేటతెల్లమవుతోంది.
దాడి జరిగిందిలా..
తిరుమంగళం సమీపంలోని ఓ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి బయలుదేరారు. కళాశాల నుంచి బయటకు అడుగు పెట్టారో లేదో వీరిపై యాసిడ్‌దాడి జరిగింది. ముందు వరుసలో వెళ్తున్న మీనా అనే విద్యార్థినిపై ఓ అజ్ఞాత వ్యక్తి యాసిడ్ చల్లాడు. ఆమె పక్కనే వెళ్తున్న స్నేహితురాలు అంకాలేశ్వరి గుర్తించి పక్కకు తప్పుకునేలోపే ఆమె మీదా ఆ వ్యక్తి యాసిడ్ పోశాడు. ఈ హఠాత్పరిణామాన్ని గుర్తించిన తోటి స్నేహితురాళ్లు కేకలు పెట్టడంతో వారి మీద సైతం యాసిడ్ చల్లేందుకు యత్నించాడు.
అప్రమత్తంగా వ్యవహరించడంతో యాసిడ్ వారి మీద పడలేదు. మీనా, అంకాలేశ్వరి తీవ్రంగా గాయపడి రోడ్డు మీద పడిపోయారు. తోటి విద్యార్థినులు పెట్టిన కేకల్ని విన్న స్థానికులు అక్కడికి ఉరకలు తీశారు. అప్పటికే ఆ అజ్ఞాత వ్యక్తి ఉడాయించాడు. గాయపడ్డ మీనా, అంకాలేశ్వరిని చికిత్స నిమిత్తం మదురై ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మదురైలో కలకలం రేపింది. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలు బయలు దేరాయి.
అధికారుల పరుగు
ఆస్పత్రిలో యాసిడ్‌దాడికి గురైన విద్యార్థినుల పరిస్థితి ఎలాఉందో తెలియని గందరగోళం నెలకొంది. ఆ విద్యార్థినుల చూపు దెబ్బ తిన్నట్టుగా ప్రచారం సాగడంతో తోటి విద్యార్థినుల్లో ఆందోళన బయలుదేరింది. రోదనలతో ఆస్పత్రి ఆవరణం మార్మోగింది. సమాచారం అందుకున్న దక్షిణ జోన్ ఐజీ అభయ్‌కుమార్ సిన్హా, మదురై జిల్లా కలెక్టర్ సుబ్రమణియన్, పోలీసు కమిషనర్ సంజయ్ మాథూర్‌ల నేతృత్వంలోని అధికారుల బృందం ఆస్పత్రి వద్దకు ఉరకలు తీసింది. విద్యార్థినుల్ని బుజ్జగించారు. లోనికి వెళ్లి గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్య పరీక్షల అనంతరం మీన ముఖానికి ఓ వైపు, అంకాలేశ్వరి చేతులు, భుజం భాగన మాత్రం గాయాలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కంటి చూపునకు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు.
అజ్ఞాత వ్యక్తి కోసం వేట
యాసిడ్ దాడికి పాల్పడ్డ అజ్ఞాత వ్యక్తి కోసం వేట ఆరంభమైంది. అతడ్ని ఇంత వరకు తామెప్పుడూ చూడలేదని గాయపడ్డ విద్యార్థినులు స్పష్టం చేయడంతో, ఆ వ్యక్తి సైకోనా...? అన్న అనుమానాలు బయలు దేరాయి. మధ్యాహ్నం వేళ ఈ ఘటన జరగడంతో నిందితుడ్ని త్వరితగతిన పట్టుకోవచ్చన్న ధీమాలో పోలీసులు ఉన్నారు. ఈ విషయంగా అభయ్‌కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినులను విచారించామని, సంఘటనా స్థలంలో విచారణ సాగుతోందన్నారు. విద్యార్థినులపై దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తిని అరెస్టు చేసి తీరుతామన్నారు.
ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని, నగరంలో తనిఖీలు ముమ్మరంచేసినట్టు తెలిపారు. కలెక్టర్ సుబ్రమణియన్ మాట్లాడుతూ విద్యార్థినుల వైద్యపరీక్షల నిమిత్తం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించామని వివరించారు. ఆ విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని, త్వరితగతిన ఆస్పత్రికి వచ్చిన దృష్ట్యా, గాయాలు, మచ్చలు త్వరాగా మాయమవుతాయని వైద్యులు వివరించినట్టు గుర్తుచేశారు. వారికి ప్రభుత్వ పరంగా సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.