రాజ్యానికీ, ప్రభుత్వానికీ తేడా ఉంది
రాజ్యానికి రాజకీయాలతో సంబంధం లేదు
ఈ విషయం గుర్తుంచుకోవాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ
విజయమ్మ, షర్మిలకు భద్రతను పునరుద్ధరించామన్న ఏజీ
వీరిద్దరి పిటిషన్లను పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వులు
మిగిలిన పిటిషన్లపై విచారణ 17కి వాయిదా
హైదరాబాద్: రాజ్యానికీ, ప్రభుత్వానికీ మధ్య తేడా ఉందని, రాజ్యానికి రాజకీయాలతో సంబంధం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హైకోర్టు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. భద్రత సమీక్ష కమిటీలను జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేయాలని, తద్వారా భద్రత కోరుతున్న వ్యక్తులు, తిరస్కరణకు గురవుతున్న వ్యక్తులు తమ వాదనలను వినిపించేందుకు అవకాశం ఉంటుందని, ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. పిటిషనర్ల భద్రతకు సంబంధించిన నివేదికలను కోర్టు ముందుంచాలని ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్‌కు స్పష్టం చేసింది. తమకు భద్రతను తొలగించడాన్ని, తగ్గించడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్‌కుమార్‌లతోపాటు పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, వారికి భద్రతను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ వ్యాజ్యాలన్నింటినీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు సోమవారం విచారించారు. విచారణ ప్రారంభం కాగానే అడ్వొకేట్ జనరల్ వేణుగోపాల్ లేచి... భద్రత సమీక్ష కమిటీ వై.ఎస్.విజయమ్మ, షర్మిలకు భద్రత కల్పించే విషయాన్ని పునః పరిశీలించి, వారిద్దరికీ భద్రత కొనసాగించాలని నిర్ణయించిందని, ఆ మేరకు వారికి భద్రతను పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. మొత్తం 9,951 వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండగా, వారిని భద్రతాపరంగా ముప్పు ఉన్న 2,500 మంది ముఖ్యులకు మా త్రం కేటాయించామని ఆయన వివరించారు. పూర్తిస్థాయి సమీక్ష తరువాత 231 మందికి భద్రతను తొలగించామని, అందులో భాగంగా పిటిషనర్లకు సైతం తొలగించామని, కాబట్టి వారికి మాత్రమే భద్రతను తొలగించామన్న పిటిషనర్ల వాదనల్లో వాస్తవం లేదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘‘రాజ్యానికీ, ప్రభుత్వానికి మధ్య తేడా ఉంది. మీరు రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యానికి రాజకీయాలతో సంబంధం లేదు. ప్రభుత్వం మాత్రమే రాజకీయాలను చూసుకుంటుంది.
ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి’’ అని వ్యాఖ్యానించారు. దీనికి వేణుగోపాల్ స్పందిస్తూ... ఆయా వ్యక్తులకు రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాల ఆధారంగా భద్రత కల్పిస్తున్నామనడంలో వాస్తవం లేదన్నారు. భద్రతా సిబ్బంది, వారికున్న ప్రాణహానిని పరిగణనలోకి తీసుకునే భద్రతను కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జిల్లా స్థాయిలో భద్రత సమీక్ష కమిటీల గురించి ప్రస్తావించారు. విజయమ్మ, షర్మిలకు భద్రతను పునరుద్ధరించామన్న ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ, వాటిని పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన పిటిషన్లపై విచారణను బుధవారానికి వాయిదా వేశారు. విజయమ్మ, షర్మిలకు ఇదివరకు ఉన్న వ్యక్తిగత భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుద్ధరించింద ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.