పోలీసులా.. మంత్రులకు తొత్తులా? | YSRCP leaders to meet DGP, condemned the highhandedness of police | Sakshi
Sakshi News home page

పోలీసులా.. మంత్రులకు తొత్తులా?

Published Fri, Nov 1 2013 4:06 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM

పోలీసులా.. మంత్రులకు తొత్తులా? - Sakshi

పోలీసులా.. మంత్రులకు తొత్తులా?

సాక్షి, హైదరాబాద్: పోలీసులు రాష్ట్ర మంత్రులకు తొత్తులుగా మారి తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను అదుపులోకి తీసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాద ముసుగులో ఉన్న వేర్పాటువాదని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ముంపు ప్రాంతాల్లో బాధిత రైతులను పరామర్శించేందుకు నల్లగొండ వెళ్లిన విజయమ్మను అడ్డుకోవడంపై డీజీపీ బి.ప్రసాదరావును కలిసిన అనంతరం పార్టీ శాసనసభాపక్ష ఉప నేత శోభానాగిరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమని, సమైక్య రాష్ట్రంలో ఎవరు ఏ ప్రాంతంలోనైనా పర్యటించే హక్కు రాజ్యాంగం కల్పించిందని చెప్పారు.
 
సమైక్యాంధ్రప్రదేశ్ చాంపియన్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే హోం శాఖ, పోలీసు శాఖ ఉందని, ఆయనే విజయమ్మ పర్యటనను పోలీసులు అడ్డుకునేవిధంగా చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో ముఖ్యమంత్రి వెళ్లి ఓదార్చాల్సి ఉందని, సీఎం చేయలేని పనిని విజయమ్మ చేస్తుంటే ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. విజయమ్మ పర్యటనను అడ్డుకోవడం, పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో వేలాది ఎకరాలు ముంపునకు గురై రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని, ఈ మంత్రులిద్దరూ సమైక్య రాష్ట్రంలోనే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులు కాలేదా? అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జనక్ ప్రసాద్ డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు.
 
డీజీపీ కార్యాలయం ఎదుట నిరసన
విజయమ్మను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డీజీపీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న పార్టీ కార్యకర్తలు ‘పోలీస్.. డౌన్‌డౌన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రభుత్వానికి తొత్తులుగా మారి విజయమ్మను అదుపులోకి తీసుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కార్యకర్తల ఆందోళన కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement