భగ్గుమన్న వైసీపీ శ్రేణులు
Published Fri, Nov 1 2013 3:17 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ఖమ్మం, నల్గోండ జిల్లాల్లో పర్యటిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై తెలంగాణ నాయకులు దాడులు చేయడం, పోలీసులు విజయమ్మను అక్రమంగా అరెస్ట్ చేయడంపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. దాడులను అడ్డుకోవడం మానేసి విజయమ్మను అరెస్ట్ చేయడం ప్రభుత్వ కుటిల నీతికి నిదర్శనమని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఒక పార్టీ గౌరవ అధ్యక్షురాలికే వ్యక్తిగత స్వేచ్ఛ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ధ్వజమెత్తుతున్నారు.
రెచ్చగొడితే సహించేది లేదు
విజయమ్మపై దాడులను నిరసిస్తూ గురువారం వైసీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్ వద్ద పార్టీ శ్రేణులు మానవహారం ఏర్పడి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ విజయమ్మపై దాడి అత్యంత హేయమైనదన్నారు. ఈ దాడిని సమైక్యవాదులపై దాడిగా పరిగణిస్తున్నామన్నారు. ప్రశాంతంగా ఉన్న తమను రెచ్చగొట్టవద్దని, ఇకపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ మాట్లాడుతూ సమైఖ్య శంఖారావ సభకు వచ్చిన ప్రతి ఒక్కరు ఒక గుడ్డుతో దాడిచేస్తే మీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇటువంటి దాడులను స్వస్థి పలకకపోతే భవిష్యత్‌లో ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ నాయకులు బీవీఆర్ చౌదరి, నులకాని వీరాస్వామినాయుడు, చనమాల శ్రీనివాస్, పోల్నాటి బాబ్జి, రావూరి కృష్ణ, పి.శ్రీనివాస్, ముప్పిడి అంజి, రాఘవరాజు ఆదివిష్ణు, వామిశెట్టి హరిబాబు, కేఎస్‌ఆర్, బోను ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రభుత్వం కుట్రే
కొవ్వూరు : విజయమ్మ అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ కొవ్వూరులో ఆ పార్టీ నాయకులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోకముందే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. విజయమ్మ పర్యటనను అడ్డుకోవడం ప్రభుత్వ కుట్రేనన్నారు. విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి జానారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్త్ఫ్ ్రచేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, నాయకులు బొంతా శ్యాం రవిప్రకాష్, మాజీ కౌన్సిలర్ భావన రాజేష్ (బెన్నీ)లతోపాటు కారుపాటి జైహింద్, ఎం.నరేంద్ర, కె.శేషగిరి పాల్గొన్నారు.
వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకోవడం తగదు
పాలకొల్లు అర్బన్ : వైసీపీ శ్రేణులు గురువారం పాలకొల్లు - మార్టేరు రోడ్డులో సుమారు గంటసేపు బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ విజయమ్మను పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. వ్యక్తి స్వేచ్ఛకు ప్రభుత్వం అడ్డుతగులుతోందని విమర్శించారు. పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్, యడ్ల తాతాజీ, మైలాబత్తుల మైఖేల్‌రాజు, గుమ్మాపు సూర్యవరప్రసాద్, పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ కోఆర్డినేటర్ పసుపులేటి రాజేష్‌ఖన్నా, మద్దా చంద్రకళ, నడింపల్లి అన్నపూర్ణ, గవర బుజ్జి, న్యాయవాది గుణ్ణం వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
నేడు అత్తిలిలో దీక్ష
అత్తిలి : వైఎస్ విజయమ్మను తెలంగాణవాదులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ అత్తిలిలో వైఎస్ విగ్రహం వద్ద శుక్రవారం నుంచి 24 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నట్టు గుమ్మంపాడు సర్పంచ్ పెన్మెత్స రామరాజు తెలిపారు.
Advertisement
Advertisement