పోలీస్ చర్యలను తప్పుబట్టిన హైకోర్టు
నగరంలో ఆపరేషన్ నైట్ డామినేషన్ రద్దు
ప్రభుత్వ మార్గదర్శకాలు తీసుకోవాలని సూచన
డీలాపడిన కమిషనరేట్ అధికారులు
ఆది నుంచి విమర్శల్లో చిక్కుకున్న ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’కు హైకోర్టులో చుక్కెదురైంది. సీపీ వెంకటేశ్వరరావు ప్రతి ష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను రద్దుచేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం తీర్పు చెప్పింది. నైట్ డామినేషన్ పేరుతో పోలీసులు తీసుకుంటున్న చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ నగరానికి చెందిన న్యాయవాది తానికొండ చిరంజీవి చేసిన వాదనతో హైకోర్టు బెంచ్ ఏకీ భవించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ సిటీ/హైదరాబాద్ : ‘నైట్ సేఫ్ సిటీ’ కార్యక్రమంలో భాగంగా గత నవంబర్ 15న ఆపరేషన్ నైట్ డామినేషన్ కార్యక్రమానికి సీపీ వెంకటేశ్వరరావు శ్రీకారం చుట్టారు. రాత్రి 11 గంటల తర్వాత తగిన గుర్తింపు పత్రాలు లేకుండా రోడ్లపై తిరగడాన్ని నిషేధించారు. పోలీసుల ఆంక్షలను ఖాతరు చేయని వారిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యారావుపేట పోలీసు కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరానికి వీరిని తరలించి విచారణ జరిపారు. రాత్రివేళ పట్టుబడిన వారి వేలిముద్రలు, కంటిపాప ఆధారాలను సేకరించారు. పాత నేరస్తులపై కేసులు నమోదుచేసి జైలుకు పంపిన పోలీసు అధికారులు మిగిలిన వారు నగరం విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తొలిరోజుల్లోనే నైట్ డామినేషన్‌ను నగరవాసులు వ్యతిరేకించారు. అత్యవసర పనుల మీద, ఆస్పత్రులకు.. ఇలా రకరకాల పనులతో హడావుడిగా వెళ్లే వారు తగిన గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లక ఇబ్బందులు పడ్డారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) కూడా నైట్ డామినేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరేమనుకున్నా వెనక్కి తగ్గేది లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. రాత్రివేళ నగరంలో తిరగాలంటే గుర్తింపు పత్రాలు తప్పనిసరి అంటూ తేల్చిచెప్పారు.
సీనియర్ న్యాయవాది పిటిషన్‌తో..
పోలీసులు చేపట్టిన ఈ నైట్ డామినేషన్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ న్యాయవాది తానికొండ చిరంజీవి డిసెంబర్ ఒకటో తేదీన హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-21లో నిర్ధేశించిన స్వేచ్ఛ, సమానత్వానికి పోలీసుల చర్య విరుద్ధమంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత గుర్తింపుకార్డులు లేని వారిని పోలీసుస్టేషన్లకు తరలించడాన్ని తప్పుబట్టారు. రాజ్యాంగంలోని సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా, లేని అధికారాలతో ప్రజల హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని చెప్పారు. పిటిషనర్ వాదనను దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 8న హైకోర్టు నైట్ డామినేషన్‌పై స్టే విధించింది. ఆ సమయంలోనే డివిజన్ బెంచ్ పోలీసుల చర్యలను తప్పుబట్టింది. ఇదే సమయంలో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు విధులు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు సోమవారం నాటి తీర్పులో నైట్ డామినేషన్‌ను రద్దు చేసింది.
ఆది నుంచి అనుకూలమే..
ఆపరేషన్ నైట్ డామినేషన్‌ను రద్దుచేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్‌సేన్ గుప్తా, సంజయ్‌కుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అధికారం లేని విషయాల్లో పోలీసుల జోక్యం కూడదంటూ నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది చిరంజీవి దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈ మేరకు ఆదేశించింది. స్టే విధింపు సమయంలోనే న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాత్రివేళ తిరగాలంటే పాస్‌పోర్టు వెంట ఉంచుకోవాలా? అంటూ అప్పట్లోనే కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం తగిన మార్గదర్శకాలు నిర్ధేశించి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ డివిజన్ బెంచ్ సూచించింది.
చెంపపెట్టు : న్యాయవాది చిరంజీవి
హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు నగర పోలీసులకు గుణపాఠమని పిల్ దాఖలు చేసిన న్యాయవాది తానికొండ చిరంజీవి వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తమకు తాము రాజులమని భావించుకుని వ్యక్తిగత ఎజెండాతో సామాన్య పౌరులను ఇబ్బంది పెట్టడం దారుణమని హైకోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు. లేని అధికారాలు సృష్టించుకుని ఎప్పుడూ తమ మాటే చెల్లాలనుకునే అధికారులకు ఈ తీర్పు చెంపపెట్టు అని పేర్కొన్నారు.
ఇంకా ఆదేశాలు అందాలి : సీపీ
నైట్ డామినేషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు అందాల్సి ఉందని సీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ నగరానికి చెందిన న్యాయవాది వేసిన పిల్‌పై చట్ట ప్రకారం పోలీసులు తమ పనిని తాము చేసుకోవచ్చని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తూ నైట్ సేఫ్టీ మెజర్స్ విషయంలో అవసరమైన సూచనలు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సూచించినట్టు పేర్కొన్నారు.
నైట్ ఢాంనేషన్
Published Tue, Mar 31 2015 12:28 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement