అభిప్రాయాలు ఓపెన్
కమిషనరేట్‌లో తొలిసారిగా ‘ఓపెన్ హౌస్’
తమ వాణి వినిపించిన నగరవాసులు
ప్రజలు సహకరిస్తేనే నేరాలు అదుపుచేయగలమన్న సీపీ
విజయవాడ సిటీ : ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’ కొనసాగించాలని ఒకరు.. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు పెరిగాయంటూ మరొకరు.. బార్‌లో మద్యం తాగి బైక్ వద్దకు రాగానే పోలీసులు కేసులు రాస్తున్నారంటూ ఇంకొకరు. కేసు పెట్టి ఏళ్లు గడుస్తున్నా పోయిన సొత్తు ఇవ్వడం లేదని, పోలీసుస్టేషన్లకు మహిళలు వెళ్లలేని స్థితి నెలకొందని మరికొందరు.. ఇలా ‘ఓపెన్ హౌస్’కు హాజరైన పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నగరంలో నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు తొలిసారిగా శనివారం కమిషనరేట్‌లో నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ అసోసియేషన్లు, సంఘాలు, పలు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్న ఓపెన్ హౌస్‌లో వారి నుంచి ఆశించిన హామీలను పోలీసులు రాబట్టలేకపోయారు. తొలుత సీపీ మాట్లాడుతూ అన్ని రకాల పోలీసులు కలిపి ఇక్కడ 2,500మంది వరకు ఉన్నట్టు తెలిపారు. వీరి జీత భత్యాలు, ఇతర అలవెన్సులు కలిపి ఏటా రూ.105 కోట్ల నుంచి రూ.110 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. పోలీసుల సంఖ్య పెంచాలంటే ప్రజల నుంచి పన్నులను పెంచాల్సి ఉంటుం దన్నారు.
అందువల్లే ఉన్న సిబ్బందితోనే తాము మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. పట్టణీకరణలో భాగంగా ఇరుకైన ఇళ్లు, అధిక జనసాంద్రత వల్ల నేరస్తులను గుర్తించడం సాధ్యంకావడంలేదన్నారు. ప్రజలు పక్కవాళ్ల గురించి మనకెందుకులే.. అనే ధోరణి కూడా నేరాల పెరుగుదలకు కారణమని చెప్పారు. కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు విలువైన వస్తువులు అందుబాటులో లేకుండా చూస్తే మంచిదన్నారు. మహిళలు రోడ్లపై వెళ్లే సమయంలో మోటారుసైకిళ్లపై రాకపోకలు సాగించేవారిని గమనిస్తూ ఉండాలని చెప్పారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద దృష్టి మరల్చేవారి పట్ల అప్రమత్తంగా ఉంటే 50శాతం నేరాలను నిలువరించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పోలీసులపై 30 శాతం భారం తగ్గుతుందన్నారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ నేరాలు జరిగే విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్‌లు తీసి పాఠశాలలు, కాలేజీలు, రైల్వే, బస్టాండ్లలో ప్రదర్శించాలని సూచించారు. మహిళలు పోలీసుస్టేషన్‌కి వెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. డీసీపీలు తఫ్సీర్ ఇక్బాల్, జీవీజీ అశోక్‌కుమార్, అదనపు డీసీపీ జి.రామకోటేశ్వరరావు, ఏసీపీలు గుణ్ణం రామకృష్ణ, వీఎస్‌ఎన్ వర్మ, పి.సుందరరాజు, లావణ్యలక్ష్మి, రాఘవరావు, టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ పాల్గొన్నారు.