బెజవాడ పోలీసులకు హైకోర్టులో ఎదురు దెబ్బ
హైదరాబాద్ : విజయవాడ పోలీసులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 'ఆపరేషన్ నైట్ డామినేషన్' పై న్యాయస్థానం సోమవారం స్టే విధించింది. ఆపరేషన్ నైట్ డామినేషన్ రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. చిరంజీవి అనే న్యాయవాది ఈ అంశంపై కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు...ఐడీ కార్డుల పేరుతో జనాన్ని వేధించటం సరికాదని వ్యాఖ్యానించింది.
బెజవాడలో అర్థరాత్రి అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు నైట్ సేఫ్ సిటీలో భాగంగా.. పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రయోగాత్మకంగా 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు పోలీసుల తనిఖీలు జరుగుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, చీకటి సందులు, గొందులు సైతం వదలకుండా గస్తీ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ.. ఆపి వారికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తారు.
పేరు.. ఊరు.. ఏం చేస్తారు.. రాత్రి వేళ ఏ పనిమీద వెళ్తున్నారు వంటి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దీనికితోడు ముఖ్యంగా సదరు పౌరునికి సంబంధించి ఆధార్‌కార్డు లేదా ప్రభుత్వం నుంచి జారీ చేయబడిన మరేదైనా గుర్తింపుకార్డు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
గుర్తింపు కార్డులు లేకున్నా.. పొంతనలేని సమాధానాలు చెప్పినా.. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరిస్తారు. ఒకవేళ పట్టుబడిన వారు నేరస్థులైతే.. పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగిస్తారు. దీనిపై న్యాయమూర్తి...హైకోర్టును ఆశ్రయించటంతో ఆపరేషన్ నైట్ డామినేషన్ను తాత్కాలికంగా బ్రేక్ వేసింది.