City Police Commissioner AB Venkateswara Rao
-
హోటల్లో దిగేవారి వివరాలు అందజేయాలి : సీపీ
విజయవాడ సిటీ : నగరంలోని హోటల్ యజమానులు రూమ్‌లు అద్దెకు తీసుకునే వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందజేయాలని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం నుంచి ఆ విధంగా చేయని హోటల్/లాడ్జి యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం కమిషనరేట్ పరిధిలోని హోటల్, లాడ్జి యజమానులతో సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ గతంలో పోలీసు స్టేషన్లకు వివరాలు అందజేయడం వలన తనిఖీల సమయంలో కటుంబంతో సహా వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గుర్తించామన్నారు. ఇలాంటి చర్యలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా ఎవరైనా వ్యక్తులు గదులు అద్దెకు తీసుకున్న వెంటనే సంబంధిత పోలీసు స్టేసన్‌కు సమాచారం అందే విధంగా కంప్యూటర్ ప్రోగ్రామ్ రూపొందించామన్నారు. ఆయా లాడ్జీ లు, హోటల్ యజమానులు కంప్యూటర్, నెట్ కనెక్షన్ తీసుకొని గదిని అద్దెకు తీసుకున్న వారి వివరాలను నిర్దేశించిన సైట్లో పొందుపరచాల న్నారు. ఈ వివరాలు వెంటనే సమీప పోలీసు స్టేషన్లకు చేరుతుందన్నారు. జాబితాను విశ్లేషించుకొని అనుమానిత వ్యక్తులపై మాత్రమే విచారణ నిర్వహిస్తామని చెప్పారు. గదులు అద్దెకు తీసుకున్న వారికి అసౌకర్యం లేకుండా భద్రతా చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో డీసీపీ జీ.వి.జీ.అశోక్‌కుమార్, ఈస్ట్‌జోన్ ఏసీపీ అభిషేక్ మహంతి, సెంట్రల్ జోన్ ఏసీపీ వై.ప్రభాకర నాయుడు, స్పెషల్ బ్రాంచి ఏసీపీ ఎస్.రమేష్‌బాబు, హోటల్, లాడ్జీల యజమానులు, వారి ప్రతినిథులు పాల్గొన్నారు. -
సీపీ చెబితే నేర్చుకునే పరిస్థితిలో మీడియా లేదు
ఏపీయూడబ్ల్యూజే గాంధీనగర్ : నగర పోలీసు కమిషనర్ ఎ.బి. వెంకటేశ్వరరావు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు కార్యవర్గ సభ్యులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు కమిషనర్ చెబితే నేర్చుకునే స్థితిలో మీడియా వారు లేరని, ఆయన చేసిన ప్రకటనలోని కథనమే నిజమని భావించడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. కళ్యాణ్ కేసు విషయంలో ఎవరితోనైనా దర్యాప్తు చేయించేందుకు అభ్యం తరం లేదని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు జర్నలిస్టులకు సత్యాన్వేషణ చేసే తీరిక, సామర్థ్యం, తపన, ఆలోచన లేదని చెప్పడంపై వారు అభ్యంతరం తెలిపారు. పౌరుల శాంతియుత జీవనంలో మీడియా పోషిస్తున్న ప్రధాన పాత్ర పోలీసు కమిషనర్‌కు తెలియదా? అని వారు ప్రశ్నిం చారు. మీడియాలో వచ్చే కథనాల్లోని వాస్తవాలు జీర్ణించుకోవడం అందరికీ శ్రేయస్కరమని, అవి తప్పనే రీతిలో ప్రజలకు తప్పుడు సంకేతాలు మీద్వారా అందించడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిం చారు. జరిగిన ఘటనలపై అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే వార్తలు ప్రచురితం, ప్రసారం అవుతాయని సీపీలాంటి పెద్దలకు తెలియంది కాదని వారు హితవు పలికారు. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన మీడియాను చులకన భావంతో చూడవద్దని కోరారు. జర్నలిస్టులను సమాజ ద్రోహులుగా చెప్పాలనుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని వారు సూచించారు. ప్రకటన జారీ చేసిన వారిలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి, కృష్ణా అర్బన్ అధ్యక్షుడు జి.రామారావు, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కె.జయరాజ్, బొంతా విలియం పాల్ ఉన్నారు. -
అదుపులోనే నేరాలు : సీపీ
విజయవాడ సిటీ : గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది నేరాలను అదుపులోనే ఉంచగలిగామని నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. వచ్చే ఏడాది నేరాల సంఖ్యను తగ్గించడంతోపాటు కేసుల దర్యాప్తు, సొత్తు స్వాధీనంలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. పోలీసు కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలి అర్ధ సంవత్సరంలో పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నందున నేరాల సంఖ్య పెరిగిందన్నారు. రెండో అర్ధ సంవత్సరంలో పోలీసులు నేరాలను గట్టిగా నిలువరించే ప్రయత్నం చేశారన్నారు. ఈ ఏడాది రూ.8,64,81,828 సొత్తు చోరీకి గురి కాగా, రూ.3,31,15,020 రికవరీ చేశామని తెలిపారు. ఇంటి దొంగతనాలు, మోసాలు, అత్యాచారం కేసులు కూడా అదుపులోనే ఉన్నాయన్నారు. రోడ్డు ప్రమాద మృతులను తగ్గించడంలో పోలీసులు సఫలీకృతమైనట్లు చెప్పారు. మగ పోలీసులతో సమస్యలు చెప్పుకోలేని మహిళలు తమకు పరిచయస్తులైన మహిళా పోలీసులతో చెప్పుకోవచ్చన్నారు. ఇందుకు స్టేషన్ పరిధితో నిమిత్తం లేదని తెలిపారు. న్యాయవాది తానికొండ చిరంజీవిపై అపార్టుమెంట్ ప్లాటు ఆక్రమణ కేసు నమోదు చేయడం వెనుక హైకోర్టు ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’పై స్టే విధించడానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ స్టేపై తాము హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తున్నామన్నారు. ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్కు విశేష ఆదరణ లభిస్తున్నట్టు సీపీ తెలిపారు. ఇప్పటివరకు శోధన వాహనాల్లో 200పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని తెలిపారు. పోలీసు సేవలు కావాల్సిన వారు డయల్-100ను విరివిగా వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. వచ్చే సంక్రాంతిలోపు డయల్-100 విజయవాడ నుంచే పని చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. చోరీకి గురైన మోటారు సైకిళ్ల ఆచూకీ కోసం త్వరలోనే ప్రత్యేక తనిఖీ చేపట్టనున్నామని చెప్పారు. ఈ సమావేశంలో డీసీపీలు తఫ్సీర్ ఇక్బాల్, జీవీజీ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అభిప్రాయాలు ఓపెన్
కమిషనరేట్‌లో తొలిసారిగా ‘ఓపెన్ హౌస్’ తమ వాణి వినిపించిన నగరవాసులు ప్రజలు సహకరిస్తేనే నేరాలు అదుపుచేయగలమన్న సీపీ విజయవాడ సిటీ : ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’ కొనసాగించాలని ఒకరు.. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు పెరిగాయంటూ మరొకరు.. బార్లో మద్యం తాగి బైక్ వద్దకు రాగానే పోలీసులు కేసులు రాస్తున్నారంటూ ఇంకొకరు. కేసు పెట్టి ఏళ్లు గడుస్తున్నా పోయిన సొత్తు ఇవ్వడం లేదని, పోలీసుస్టేషన్లకు మహిళలు వెళ్లలేని స్థితి నెలకొందని మరికొందరు.. ఇలా ‘ఓపెన్ హౌస్’కు హాజరైన పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నగరంలో నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు తొలిసారిగా శనివారం కమిషనరేట్‌లో నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ అసోసియేషన్లు, సంఘాలు, పలు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్న ఓపెన్ హౌస్‌లో వారి నుంచి ఆశించిన హామీలను పోలీసులు రాబట్టలేకపోయారు. తొలుత సీపీ మాట్లాడుతూ అన్ని రకాల పోలీసులు కలిపి ఇక్కడ 2,500మంది వరకు ఉన్నట్టు తెలిపారు. వీరి జీత భత్యాలు, ఇతర అలవెన్సులు కలిపి ఏటా రూ.105 కోట్ల నుంచి రూ.110 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. పోలీసుల సంఖ్య పెంచాలంటే ప్రజల నుంచి పన్నులను పెంచాల్సి ఉంటుం దన్నారు. అందువల్లే ఉన్న సిబ్బందితోనే తాము మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. పట్టణీకరణలో భాగంగా ఇరుకైన ఇళ్లు, అధిక జనసాంద్రత వల్ల నేరస్తులను గుర్తించడం సాధ్యంకావడంలేదన్నారు. ప్రజలు పక్కవాళ్ల గురించి మనకెందుకులే.. అనే ధోరణి కూడా నేరాల పెరుగుదలకు కారణమని చెప్పారు. కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు విలువైన వస్తువులు అందుబాటులో లేకుండా చూస్తే మంచిదన్నారు. మహిళలు రోడ్లపై వెళ్లే సమయంలో మోటారుసైకిళ్లపై రాకపోకలు సాగించేవారిని గమనిస్తూ ఉండాలని చెప్పారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద దృష్టి మరల్చేవారి పట్ల అప్రమత్తంగా ఉంటే 50శాతం నేరాలను నిలువరించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పోలీసులపై 30 శాతం భారం తగ్గుతుందన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ నేరాలు జరిగే విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్‌లు తీసి పాఠశాలలు, కాలేజీలు, రైల్వే, బస్టాండ్లలో ప్రదర్శించాలని సూచించారు. మహిళలు పోలీసుస్టేషన్‌కి వెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. డీసీపీలు తఫ్సీర్ ఇక్బాల్, జీవీజీ అశోక్‌కుమార్, అదనపు డీసీపీ జి.రామకోటేశ్వరరావు, ఏసీపీలు గుణ్ణం రామకృష్ణ, వీఎస్ఎన్ వర్మ, పి.సుందరరాజు, లావణ్యలక్ష్మి, రాఘవరావు, టీఎస్ఆర్కే ప్రసాద్ పాల్గొన్నారు.